ప్రచ్ఛన్నయుద్ధ కాలంలో సోవియట్ యూనియన్‌ను నిలువరించేందుకు ఏర్పడిన నాటో కూటమి.. తర్వాత ఆ యుద్ధ ఛాయలు ముగిసినా ఆ దేశాన్నే ప్రథమ శత్రువుగా భావించాయి. నిన్న మొన్నటివరకు రష్యానే ప్రత్యర్థిగా చూశాయి. అయితే తొలిసారి నాటో వైఖరిలో మార్పు వచ్చింది. బ్రసెల్స్‌లో సోమవారం నాటో ప్రధాన కార్యాలయంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్ సహ 30 దేశాధినేతల సమావేశం.. చైనా ముప్పుపై తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది.
ప్రపంచానికే ముప్పు..
సైనికపరంగా చైనాతో ప్రపంచ భద్రతకే ప్రమాదం పొంచి ఉందని పేర్కొంది. ముఖ్యంగా అణుక్షిపణుల తయారీలో ఆ దేశం కనబరుస్తున్న వేగంపై నాటో కూటమి చర్చించింది. చైనా బాధ్యతగా వ్యవహరించాలని, అంతర్జాతీయ నియమాలను గౌరవించాలని తీర్మానంలో పేర్కొంది. నాటో తీర్మానంలో చైనా పేరును ప్రస్తావించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. బైడెన్ కూడా చైనా రష్యాలు అనుసరిస్తున్న వైఖరిని తప్పుపట్టారు.
ఆ దేశాలు తాము ఆశించిన రీతిలో ప్రవర్తించడం లేదని అన్నారు. అంతకుముందు నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ విలేకరులతో మాట్లాడుతూ చైనాతో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొవడానికి నాటో కూటమి సిద్ధంగా ఉండాలని పిలుపిచ్చారు. బాల్టిక్స్ నుంచి ఆఫ్రికా వరకు ఎక్కడ చూసినా చైనాయే కనిపిస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
"చైనా మనకు సమీపంగా వస్తోంది. సైబర్ రంగంలో ఉంది. ఆఫ్రికాలోనూ ఆ దేశం కనిపిస్తోంది. మనకు చెందిన చాలా కీలకమైన రంగాల్లో భారీగా పెట్టుబడులు పెడుతోంది. అదే సమయంలో చైనా మాకు శత్రువు కాదు. చైనాతో ప్రచ్ఛన్న యుద్ధం చేయాలనుకోవడం లేదు. ఆ దేశం ప్రత్యర్థీ కాదు, శుత్రువూ కాదు. ప్రచ్ఛన్నయుద్ధం తర్వాత రష్యాతో ఇంతలా సంబంధాలు దిగజారడం ఇదే తొలిసారి. అంతర్జాతీయ చట్టాలను ఆ దేశం గౌరవించాలని, సైబర్ దాడులు మానుకోవాలి."