విశ్వాన్వేషణలో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. అంగారక గ్రహం (మార్స్)పై అత్యంత అధునాతనమైన, 'తెలివైన' రోవర్ 'పర్సెవరెన్స్'ను విజయవంతంగా దించింది. 'అరుణ గ్రహంపై గతంలో జీవం ఉండేదా' అన్న కీలక ప్రశ్నకు ఇది సమాధానం కనుగొనే ప్రయత్నం చేస్తుంది. భవిష్యత్‌లో అక్కడికి మానవులను పంపేందుకు అవసరమైన కీలక పరిజ్ఞానాలను ఇది పరీక్షిస్తుంది. అంగారకుడి ఉపరితల, వాతావరణ పరిస్థితులపై అధునాతన పరికరాలతో పరిశీలనలు సాగిస్తుంది. ఈ అద్భుత విజయాన్ని సాధించిన నాసాను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌లు అభినందించారు.
అంగారకుడిపై నవ్య చరిత్ర! - అంగారక గ్రహం
అంగారక గ్రహంపై తెలివైన రోవర్ పర్సెవరెన్స్‌ను నాసా విజయవంతంగా దింపి కొత్త శకానికి నాంది పలికింది. అరుణ గ్రహంపై గతంలో జీవం ఉండేదా? అన్న ముఖ్యమైన సమాచారాన్ని తెలుసుకొనే ప్రయత్నం ఈ రోవర్ చేస్తుంది.
'మార్స్ 2020' ప్రాజెక్టులో భాగంగా గత ఏడాది జులై 30న ఫ్లోరిడాలోని కేప్ కెనావెరాల్ నుంచి పర్సెవరెన్స్‌ను నాసా ప్రయోగించింది. విశ్వంలో ఇది 203 రోజుల పాటు 47.2 కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణించి శుక్రవారం తెల్లవారుజామున 2.25 గంటలకు అంగారక వాతావరణంలోకి ప్రవేశించింది. భూమితో పోలిస్తే నామమాత్రపు సాంద్రత కలిగిన అరుణ గ్రహ గాలిలో వ్యోమనౌక వేగాన్ని నియంత్రించి, లక్షిత ప్రదేశంలో సాఫీగా దించడం చాలా సవాళ్లతో కూడుకున్న వ్యవహారం. ఈ క్రమంలో వాతావరణ రాపిడి వల్ల చెలరేగే తీవ్ర ఉష్ణోగ్రతలనూ అది అధిగమించాలి. ఉష్ణ కవచం, పారాచూట్, రాకెట్లతో కూడిన స్కైక్రేన్ వ్యవస్థ ద్వారా రోవర్ సాఫీగా దిగింది. ల్యాండింగ్ ప్రక్రియను వ్యోమనౌక స్వయంగా నియంత్రించుకోవడం విశేషం.
ల్యాండింగ్‌కు ముందు కాలిఫోర్నియాలోని నాసా జెట్ ప్రొపల్షన్ ల్యాబ్‌లో శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు క్షణక్షణం ఉత్కంఠభరితంగా గడిపారు. "అంగారకుడిపై రోవర్ విజయవంతంగా దిగిందని సంకేతం వచ్చింది. పర్సెవరెన్స్.. సురక్షితంగా ఆ గ్రహంపై అడుగుపెట్టింది" అని భారత సంతతికి చెందిన ఫ్లైట్ కంట్రోలర్ స్వాతి మోహన్ ప్రకటించగానే అక్కడ ఒక్కసారిగా ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. శాస్త్రవేత్తలు కేరింతలు కొడుతూ.. పరస్పరం అభినందించుకున్నారు. ఆ వెంటనే పర్సెవరెన్స్ క్లిక్‌మనిపించిన తొలి చిత్రాలు అందాయి.
ఇదీ చూడండి:అమెరికా కాంగ్రెస్‌లో కీలక బిల్లు- 1.1కోట్ల మందికి లబ్ధి