అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్) వేదికగా వినూత్న ప్రయోగాలు జరిపే నాసా.. తాజాగా ముల్లంగి పంటను సాగు చేసి విజయం సాధించింది. ఐఎస్‌ఎస్‌లోని ఐరోపా మాడ్యుల్‌లో మైక్రోగ్రావిటీలో ఈ పంటను పండించింది. రోదసీలో గురుత్వాకర్షణ శక్తి లేకపోవడం వల్ల వేళ్లు పెరగడం సాధ్యం కాదు. కానీ, దిండుల్లాంటి ప్రత్యేక ప్యాకేజీల్లో మట్టి, ఎరువులు, నీటిని ఉంచి అందులో విత్తనాలు నాటే ఏర్పాట్లు చేశారు. పంటల సాగు కోసం ఐఎస్‌ఎస్‌లో ప్రత్యేక గదిని రూపొందించారు. ఎల్‌ఈడీ విద్యుద్దీపాలు, పొడిగా ఉండే మట్టి, 180 రకాల ప్రత్యేక సెన్సర్లు, కెమెరాలతో దీన్ని సిద్ధం చేశారు. నాసాకు చెందిన కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి నిరంతరం మొక్కల పెరుగుదలను పర్యవేక్షిస్తారు. ఇక్కడి నుంచే నీరు, కాంతిని నియంత్రిస్తారు. తాజాగా పండించిన ముల్లంగిపై అక్కడి వ్యోమగాములు ప్రయోగాలు జరపనున్నారు. అలాగే భూమిపైకీ వాటి నమూనాల్ని పంపిస్తారు.
అంతరిక్షంలో ముల్లంగిని సాగు చేసిన నాసా
అంతరిక్షంలో ముల్లంగి పంటను సాగు చేసి విజయం సాధించింది నాసా. ఎస్‌ఎస్‌లోని ఐరోపా మాడ్యుల్‌లో మైక్రోగ్రావిటీలో ఈ పంటను పండించింది. రోదసీలో గురుత్వాకర్షణ శక్తి లేకపోవడం వల్ల వేళ్లు పెరగడం సాధ్యం కాదు. కానీ, దిండుల్లాంటి ప్రత్యేక ప్యాకేజీల్లో మట్టి, ఎరువులు, నీటిని ఉంచి అందులో విత్తనాలు నాటే ఏర్పాట్లు చేశారు.
అంతరిక్షంలో అధ్యయనం కోసం ఎంచుకున్న 'అరబిడోప్సిస్' జాతికి చెందిన మొక్కలకు, ముల్లంగికి దగ్గరి పోలికలు ఉంటాయి. అందుకే సాగు కోసం దీన్ని ఎంపిక చేశారు. అలాగే ముల్లంగి తినడానికి వీలైన, పోషకాలు గల పంట కూడా. భవిష్యత్తులో చంద్రుడు, అంగారకుడిపైకి మానవసహిత యాత్రలకు విస్తృత స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్న విషయం తెలిసిందే. వాటిపై లోతైన అధ్యయనం చేయాలంటే అంతరిక్షంలో సుదీర్ఘకాలం ఉండాల్సిన అవసరం ఏర్పడవచ్చు. ఈ నేపథ్యంలో రోదసీలో పంటల సాగు భవిష్యత్తు అంతరిక్షయానాలకు ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది. ఐఎస్‌ఎస్‌లో గతంలో మిరప సహా రెడ్ రొమైన్ లెటుస్ అనే ఆకు కూరను పండించారు. అయితే, వీటి కంటే ముల్లంగి అత్యంత పోషకాలు గల ఆహారం కావడం విశేషం.