చైనా ప్రయోగించిన లాంగ్‌మార్చ్ 5బీ రాకెట్ హిందూ మహాసముద్రంలో మాల్దీవులకు సమీపంలో పడింది. దీనిపై అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) స్పందించింది. అంతరిక్షవస్తువుల శిథిలాల్ని కూల్చే నియమాలను పాటించడంలో చైనా విఫలమైందని విమర్శించింది.
విఫలమైన రాకెట్, ఉపగ్రహ వస్తువులు భూమి మీద పడేటప్పుడు ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు ముప్పు వాటిల్లకుండా అంతరిక్ష పరిశోధనలు చేసే దేశాలు చూడాలని నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ స్పష్టం చేశారు.
"అంతరిక్ష శిథిలాలకు సంబంధించి బాధ్యతాయుతమైన ప్రమాణాలను పాటించడంలో చైనా విఫలమైంది. చైనా ఇతర అన్నిదేశాలు, వాణిజ్య సంస్థలు అంతరిక్ష పరిశోధనలు చేసేటప్పుడు బాధ్యతగా, పారదర్శకంగా పనిచేయాలి. అంతరిక్ష వస్తువులు భూమిపై పడకుండా పరిశోధనల్లో పారదర్శకత పాటించాలి."