అంగారకుడి ఉపరితలంపైకి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) ప్రవేశ పెట్టిన ఇన్‌జెన్యూటీ హెలికాప్టర్ ఎగరడానికి మరింత సమయం పట్టేలా ఉంది. వాస్తవానికి ఈ ప్రయోగం.. ఆదివారమే జరగాల్సి ఉంది. కానీ ఈ ప్రయోగాన్ని ఈ నెల 14కు వాయిదా వేయాలని నిర్ణయించింది నాసా.
శుక్రవారం తలపెట్టిన రోటర్ల హై-స్పీడ్ స్పిన్ పరీక్షలో 'వాచ్డాగ్' టైమర్ కమాండ్ సీక్వెన్స్ ప్రారంభంలోనే ముగిసిందని తెలిపింది నాసా. దీంతో ప్రయోగాన్ని ఈ నెల 14కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఫ్లైట్ కంప్యూటర్‌ను 'ప్రీ-ఫ్లైట్' నుంచి 'ఫ్లైట్' మోడ్‌కు మార్చే క్రమంలో ఇలా జరిగినట్లు వెల్లడించింది. అయితే హెలికాప్టర్ సురక్షితంగా ఉందని.. అక్కడి నుంచి సమాచారం భూమికి అందుతోందని వెల్లడించారు.