ట్యాక్సీల కోసం రోడ్డుపైకి కాకుండా గాల్లోకి చూసే రోజులు రాబోతున్నాయి. రద్దీగా ఉండే నగరాల్లో ప్రయాణికులు, సరకులను ఒక చోటు నుంచి మరో చోటుకు చేరవేసే విద్యుత్ ఎయిర్ ట్యాక్సీలను(nasa flying taxis)వినియోగంలోకి తెచ్చే దిశగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) కసరత్తు మొదలుపెట్టింది. ఎలక్ట్రికల్ వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ (ఈవీటీవోఎల్) లోహ విహంగాన్ని తొలిసారిగా పరీక్షించింది.
ఇది నిట్టనిలువుగా గాల్లోకి లేవగలదు. అలాగే దిగగలదు. ఈవీటీవోఎల్‌ను అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ (ఏఏఎం) నేషనల్ క్యాంపెయిన్ కింద నాసా పరీక్షిస్తోంది. కాలిఫోర్నియాలోని బిగ్ సర్ వద్ద ఉన్న వైమానిక కేంద్రం ఇందుకు వేదికైంది. తాజా పరీక్షల్లో ఈ లోహవిహంగం వెలువరించే శబ్దాన్ని నాసా ఇంజినీర్లు కొలుస్తున్నారు. దీన్ని సంప్రదాయ హెలికాప్టర్లు, డ్రోన్లు, ఇతర లోహవిహంగాల ద్వారా వెలువడే శబ్దాలతో పోల్చి చూస్తారు. తద్వారా పట్టణ ప్రాంతాల్లో ఇలాంటి హెలికాప్టర్లు ఎంత మేర రణగొణ ధ్వనులను పెంచుతాయన్నది నిర్ధరించనున్నారు. భవిష్యత్‌లో నగరాల్లో ఎయిర్ ట్యాక్సీలను వినియోగించేందుకు అవసరమైన మార్గదర్శకాల రూపకల్పనకూ ఈ డేటాను ఉపయోగించనున్నారు.