అంతరిక్షంలోకి వ్యోమగాములను తీసుకెళ్లే ప్రయోగాన్ని స్పేస్ ఎక్స్ విజయవంతంగా నిర్వహించింది. కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి నలుగురు వ్యోమగాములతో కూడిన ఫాల్కన్ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగం ద్వారా నలుగురు వ్యోమగాములను అంతరిక్ష కేంద్రానికి చేర్చనుంది స్పేస్ ఎక్స్. ఓ ప్రైవేటు సంస్థ నాసాకు పూర్తి స్థాయి వాహకనౌక ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. కాగా ఇది స్పేస్ ఎక్స్ చేపట్టిన రెండో మానవసహిత అంతరిక్ష ప్రయోగం.
ప్రయోగానికి మస్క్ దూరం
కరోనా పరీక్షల్లో అయోమయం నెలకొన్న కారణంగా స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ ఈ ప్రయోగానికి దూరంగా ఉన్నారు. ఇదివరకు నిర్వహించిన నాలుగు కరోనా పరీక్షల్లో ఆయనకు రెండుసార్లు పాజిటివ్, రెండు సార్లు నెగెటివ్ వచ్చింది. ప్రామాణిక ప్రయోగ ఫలితం కోసం ఎదురుచూస్తున్నారు. నాసా నిబంధనల ప్రకారం కరోనా సోకినవారు క్వారంటైన్‌లోనే ఉండాలి. ఈ నేపథ్యంలో కెన్నెడీ స్పేస్ సెంటర్‌కు ఆయన రాలేదు.
అంతరిక్షయానాల కోసం ప్రైవేట్ సంస్థ స్పేస్‌ఎక్స్‌తో నాసా ఒప్పందం కుదుర్చుకుంది. దీనిప్రకారం.. భవిష్యత్తు అంతరిక్షయానాలకు స్పేస్‌ఎక్స్ వ్యోమనౌకల్ని అందించాల్సి ఉంటుంది. అందులో భాగంగా నిర్మించిందే ఈ ‘క్రూ డ్రాగన్’. మేలో దీన్ని తొలిసారి ప్రయోగాత్మకంగా ప్రయోగించారు. ఇద్దరు వ్యోమగాములు ఐఎస్‌ఎస్‌కు వెళ్లి రెండు నెలల తర్వాత క్షేమంగా తిరిగి వచ్చారు. ప్రయోగం విజయవంతం కావడంతో స్పేస్‌ఎక్స్ పూర్తిస్థాయి వాణిజ్య ప్రయోగాలకు నాసా అనుమతించింది. నేడు జరిగిన ప్రయోగం రోదసీయాన చరిత్రలో తొలి వాణిజ్య అంతరిక్షయానంగా చెప్పవచ్చు. ఒకరకంగా అంతరిక్షంలోకి ట్యాక్సీ సర్వీసులు ప్రారంభమైనట్లే. ఇకపై అమెరికాకు భారీగా బడ్జెట్ ఆదా కానుంది. 2011 తర్వాత అమెరికా తమ సొంత సొంత వ్యోమనౌకల్ని ఉపయోగించడం నిలిపివేసింది. అప్పటి నుంచి రష్యాకు చెందిన సోయుజ్‌లో తమ వ్యోమగాముల్ని ఐఎస్‌ఎస్‌కు పంపుతోంది. దీనికి భారీగా చెల్లించాల్సి వస్తోంది. మరోవైపు తాజాగా ఫాల్కన్ రాకెట్‌లో ఉపయోగించిన తొలి దశ బూస్టర్‌ని మరోసారి వినియోగించేలా నిర్మించారు.
నాలుగు సార్లు స్పేస్‌వాక్..
ఈ ప్రయోగంతో అంతరిక్షయాన చరిత్రలో ఓ కొత్తం శకం ప్రారంభమైందని నాసా తెలిపింది. ఇక నుంచి భూదిగువ కక్ష్యలోకి తరచూ జరిగే అంతరిక్షయానాలకు ఓ ప్రైవేటు సంస్థ సేవలనందించనుందని పేర్కొంది.
తాజాగా వెళ్లిన వ్యోమగాములు మొత్తం నాలుగు సార్లు స్పేస్‌వాక్ చేయాల్సి ఉంది. యూకేకు చెందిన ఎండీయే రూపొందించిన ‘కోకా కమ్యూనికేషన్స్ టెర్మినల్’ను ఐఎస్‌ఎస్‌లోని ఐరోపా స్పేస్ మాడ్యూల్ కొలంబస్‌కు బిగించనున్నారు. దీని ద్వారా అక్కడ ఉన్న వ్యోమగాములు భూమిపై ఉండే బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్‌తో ఇక్కడి శాస్త్రవేత్తలు, కుటుంబ సభ్యులతో ముచ్చటించవచ్చు.