2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో రష్యా జోక్యంపై దర్యాప్తు చేపట్టి నివేదిక రూపొందించిన స్పెషల్ కౌన్సిల్ రాబర్ట్ ముల్లర్ తన పదవికి రాజీనామా చేశారు. రెండేళ్ల పాటు రూపొందించిన నివేదికపై తొలిసారి బహిరంగంగా మాట్లాడారు ముల్లర్. ట్రంప్ ఎలాంటి నేరానికి పాల్పడలేదని తాము విశ్వసించి ఉంటే ఈపాటికే ఆ విషయాన్ని ప్రకటించే వారిమని అన్నారు ముల్లర్. ట్రంప్‌ను నిర్దోషిగా ప్రకటించలేమని, అలాగని ఆయనపై అభియోగమూ మోపలేమని తెలిపారు.
తాను రూపొందించిన నివేదిక అందరికీ అందుబాటులో ఉన్నందున ఈ విషయంపై ఎక్కువ మాట్లాడలేనని తెలిపారు ముల్లర్. వ్యక్తిగత జీవితాన్నిస్వేచ్ఛగా గడిపేందుకే పదవి నుంచి తప్పుకుంటున్నట్టు తెలిపారు.
ట్రంప్ ప్రచారంలో రష్యా జోక్యంపై రెండేళ్లపాటు దర్యాప్తు చేపట్టి ఈ ఏడాది మార్చిలో 400పేజీలతో కూడిన నివేదికను రూపొందించారు ముల్లర్. ట్రంప్‌ను దోషిగా ప్రకటించేందుకు ఎలాంటి ఆధారాలు లభించలేదని నివేదికలో స్పష్టం చేశారు. తమ నివేదికను అటార్నీ జనరల్‌కు అందజేసినందున పదవి నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొన్నారు.