కొవిడ్-19 బాధితురాలైన తల్లి నుంచి నవజాత శిశివుకు కరోనా వైరస్ వ్యాప్తి చెందే ముప్పు తక్కువేనని అమెరికా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అయితే ఆ వ్యాధి కారణంగా మాతృమూర్తిలో తలెత్తే రుగ్మతల వల్ల చిన్నారుల ఆరోగ్యంపై పరోక్ష ప్రభావం పడుతుందని తెలిపారు.
బెథ్ ఇజ్రాయెల్ డోకోనెస్ మెడికల్ సెంటర్(బీఐడీఎంసీ), బ్రిగ్హామ్ అండ్ వుమెన్స్ హాస్పిటల్, బోస్టన్ చిల్డ్రన్స్ హాస్పిటల్, మస్సాచు సెట్స్ జనరల్ హాస్పిటల్ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. తల్లి నుంచి నవజాత శిశివుకు కరోనా వ్యాప్తికి దోహదపడే ముప్పులను లోతుగా శోధించిన తొలి అధ్యయనం ఇదేనని వారు చెప్పారు.
కాన్పు పద్ధతి, తల్లిలో అనారోగ్య స్థాయి వంటి అంశాలు.. శిశువులో కొవిడ్ ఇన్ఫెక్షన్ ముప్పును పెంచుతాయని తాము భావించామని శాస్త్రవేత్తలు తెలిపారు. ఫలితాలు భిన్నంగా ఉండటం తమను ఆశ్చర్యానికి గురిచేశాయని పేర్కొన్నారు. 11 ఆసుపత్రుల్లో జన్మించిన 255 మంది శిశువులపై వారు పరిశోధించారు. ఈ చిన్నారుల తల్లులకు 2.2 శాతం మందికే కరోనా పాజిటివ్ వచ్చింది. తల్లిలోని ఇన్ఫెక్షన్ వల్ల బిడ్డ ఆరోగ్యంపై పెను ప్రభావమే పడినట్లు తేలింది.
నెలలు నిండకుండానే కాన్పు కావడం, తక్కువ బరువుతో శిశువు జన్మించడం, బిడ్డను తిరిగి స్పృహలోకి తీసుకురావడానికి ప్రయత్నించాల్సి రావడం, ఆసుపత్రిలో ఎక్కువ కాలం ఉండాల్సి రావడం, డిశ్చార్జి అయిన నెలలోపే మళ్లీ ఆసుపత్రిని సందర్శించాల్సి రావడం వంటివి ఇందులో ఉన్నాయని వివరించారు. నెలలు నిండకుండానే జన్మించడం వల్ల ఆ శిశువుల్లో శ్వాస సమస్యలు, దీర్ఘకాల అనారోగ్యం, ఎదుగుదలకు సంబంధించిన లోపాలు తలెత్తే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. సామాజికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్న తల్లులకు జన్మించే శిశువులకు కొవిడ్ సోకే ప్రమాదం ఐదు రెట్లు ఎక్కువగా ఉందని తేల్చారు.
ఇదీ చదవండి:మైనర్పై 15 ఏళ్ల యువకుడు అత్యాచారం