తెలంగాణ

telangana

By

Published : Nov 8, 2020, 12:02 PM IST

ETV Bharat / international

కమల-బైడెన్​లకు ప్రపంచ నేతల అభినందనలు

అమెరికా తదుపరి అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్​కు ప్రపంచ దేశాల నేతలు శుభాకాంక్షలు తెలిపారు. అమెరికా తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా గెలుపొందిన కమలా హారిస్​కు అభినందనలు చెప్పారు. అయితే మెలానియా సొంత దేశమైన స్లొవేనియా మాత్రం ఇంకా ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్​కే మద్దతు ఇస్తుండటం విశేషం. మరోవైపు ఫలితాలపై రష్యా, బ్రెజిల్ వంటి దేశాలు ఇంకా స్పందించలేదు.

Most world leaders express hope, relief after Biden win
కమల-బైడెన్​లకు ప్రపంచ నేతల అభినందనలు

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయఢంకా మోగించిన జో బైడెన్​కు ప్రపంచదేశాల నేతల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అంతర్జాతీయ ప్రజాస్వామ్యాన్ని బలపరిచే అవకాశం లభించిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా తన తొలి మహిళా ఉపాధ్యక్షురాలిని ఎన్నుకోవడాన్ని స్వాగతిస్తున్నాయి.

"అమెరికన్లు తమ అధ్యక్షుడిని ఎన్నుకున్నారు. జో బైడెన్, కమలా హారిస్​లకు అభినందనలు. ప్రస్తుతం ఉన్న సవాళ్లను అధిగమించడానికి మనం చాలా చేయాల్సి ఉంది. కలిసికట్టుగా పనిచేద్దాం."

-ఇమ్మాన్యుయెల్ మేక్రాన్,ఫ్రాన్స్​ అధ్యక్షుడు

అమెరికా కొత్త ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నాట్లు పాశ్చాత్య దేశాధినేతలు స్పష్టం చేశారు. జర్మనీ ఛాన్స్​లర్ ఎంజెలా మెర్కెల్, నాటో సెక్రెటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్​బర్గ్, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతే ఎల్​ సిసి, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్​స్కీలు బైడెన్ విజయానికి శుభాకాంక్షలు తెలిపారు.

బైడెన్ తన అధ్యక్ష పదవికి మరింత విలువ తీసుకొస్తారని నైజీరియా అధ్యక్షుడు ముహ్మదు బుహారీ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచ సంబంధాల విషయంలో జాతీయవాద రాజకీయాల వల్ల తలెత్తే ప్రతికూల పరిణామాలపై పోరాడాలని బైడెన్​కు విజ్ఞప్తి చేశారు.

ట్రంప్ యంత్రాంగం తీసుకున్న నిర్ణాయలను వ్యతిరేకించిన దేశాలతో పాటు, ఆయనకు సన్నిహితంగా ఉన్న నేతల నుంచి కూడా అభినందనలు వ్యక్తమవుతున్నాయి. ట్రంప్ అల్లుడు జరేడ్ కుష్నర్​తో సన్నిహితంగా వ్యవహరించే యూఏఈ యువరాజు మహమ్మద్ బిన్ జయేద్ అల్ నహ్యాన్ సైతం బైడెన్​కు శుభాకాంక్షలు తెలిపారు. ఉపాధ్యక్ష పదవికి ఎన్నికైన కమలా హారిస్​కు అభినందలు తెలిపారు.

ట్రంప్​ మిత్రుడైన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సైతం బైడెన్ విజయం సాధించడంపై అభినందనలు తెలిపారు. భద్రత, వాణిజ్యం, వాతావరణం వంటి విషయాల్లో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నానన్నారు.

ట్రంప్​కే మద్దతు!

అయితే అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ సొంత దేశమైన స్లొవేనియా మాత్రం ఎన్నికల ఫలితాలపై అపనమ్మకం వ్యక్తం చేస్తోంది. లెక్కింపు పూర్తి కాక ముందే ట్రంప్​కు అభినందనలు తెలిపిన స్లొవేనియా ప్రధాన మంత్రి జనేజ్ జన్సా... బైడెన్ గెలిచారని ప్రకటన వెలువడిన తర్వాత కూడా ట్రంప్​కే మద్దతిచ్చారు.

మరోవైపు బైడెన్ విజయంపై ఇరాక్​లోనూ మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. 2003లో ఇరాక్​పై అమెరికా దండయాత్ర వెనుక బైడెన్​దే కీలక హస్తం కావడం వల్ల... అక్కడి ప్రజల్లో కాస్త వ్యతిరేకత ఉంది. మరోవైపు ఇరాన్ సైన్యంలోని ఉన్నతాధికారిని అమెరికా హత్య చేసినందుకు ట్రంప్​కు మద్దతిస్తున్నారు. కాగా.. ఇరాక్ అధ్యక్షుడు బర్హమ్ సాలి మాత్రం బైడెన్ విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. బైడెన్​ను తన స్నేహితుడిగా పేర్కొన్నారు. అమెరికాను నమ్మకమైన భాగస్వామిగా అభివర్ణించారు.

'కమల' వికాసంపై హర్షం

భారతీయ మూలాలున్న ఆఫ్రో అమెరికన్ కమలా హారిస్ విజయంపై ఆఫ్రికాలోని పలు దేశాలు సంతోషం వ్యక్తం చేశాయి. ఓ మహిళ ఈ ఘనత సాధించడం గర్వకారణమని పేర్కొన్నాయి. పురుషాధిక్యతను తొలగించే విధంగా కమలా హారిస్ విజయం మేలుకొలుపు కావాలని ఆకాంక్షించాయి. 'మన దేశంలోనూ అత్యున్నత పదవిని అధిరోహించే విధంగా మహిళలకు అవకాశం కల్పించేందుకు సమయం ఆసన్నమైంద'ని నైజీరియా కేబినెట్ మంత్రి ఫెస్టుక్ కీయామో ట్వీట్ చేశారు.

మరోవైపు ట్రంప్​కు అత్యంత సన్నిహితంగా మెలిగిన బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సొనారో, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు, సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ మాత్రం అమెరికా ఎన్నికలపై ఇంకా స్పందించలేదు. రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ నుంచి కూడా ఎలాంటి ప్రకటన రాలేదు. నియంతృత్వ దేశాల నుంచీ స్పందన కరవైంది.

ABOUT THE AUTHOR

...view details