తెలంగాణ

telangana

ETV Bharat / international

అగ్రరాజ్యానికి వడదెబ్బ- పదుల సంఖ్యలో మృతి - అమెరికాలో భారీగా ఉష్ణోగ్రతలు

భారీ ఉష్ణోగ్రతలతో అమెరికా ఉక్కిరిబిక్కిరి అవుతోంది. వేడి గాలులు, వడదెబ్బ ధాటికి వాషింగ్టన్​, ఒరేగాన్​లో ఇప్పటి వరకు పదుల సంఖ్యలో మృతిచెందారు. మంగళవారం పశ్చిమ అమెరికాలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అత్యధికంగా 37 డిగ్రీలు దాటినట్లు అమెరికా వాతావరణ శాఖ తెలిపింది.

heat wave in america
అమెరికాలో భారీగా ఉష్ణోగ్రతలు

By

Published : Jun 30, 2021, 2:49 PM IST

మండుతున్న ఎండలు

భానుడి భగభగలకు అమెరికా అల్లాడిపోతోంది. వేడిగాలులు, వడదెబ్బ ధాటికి పశ్చిమ ప్రాంతంలోని వాషింగ్టన్​, ఒరేగాన్​లో పదుల సంఖ్యలో మృతి చెందారు. అమెరికాలోని సీటెల్, పోర్ట్​ల్యాండ్ నగరాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు 37.7 డిగ్రీలు నమోదైనట్లు అమెరికా వాతావరణ శాఖ తెలిపింది. స్పొకేన్ ప్రాంతంలో అత్యధికంగా మంగళవారం 42.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు పేర్కొంది.

పశ్చిమ అమెరికా భగభగ

చల్లదనానికి ఈత కొడుతూ..
నదిలో ఈత కొట్టేందుకు సిద్ధమైన యువత

వేసవికాలం ఆరంభంలోనే అమెరికాను ముఖ్యంగా పశ్చిమ అమెరికా రాష్ట్రాలను ఎండలు ఠారెత్తిస్తున్నాయి. దీంతో పశ్చిమ ప్రాంతాల్లో సుమారు 4 కోట్ల మంది ప్రజల్ని అమెరికా వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. అనవసరంగా బయటకు రాకూడదంటూ హెచ్చరికలు జారీ చేసింది.

11 రాష్ట్రాల్లో..

నీటిలో ఆడుతున్న బాలుడు
నీటిపై సేదతీరుతూ..

దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో గతంలో కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇదో అనూహ్య పరిస్థితిగా పేర్కొంది. అంతేగాకుండా ఈసారి వేసవిలో అన్ని రికార్డులూ బద్దలయ్యేలా ఉన్నాయని అంచనా వేస్తోంది. సోమవారం ఫీనిక్స్‌లో 46 డిగ్రీల సెల్సియస్, సియాటిల్‌లాంటి చోట్ల 44 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదివారం పోర్ట్‌లాండ్‌లో 44.4 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. 1940 నుంచి ఇప్పటిదాకా ఇదే అత్యధిక రికార్డుగా చెబుతున్నారు. సియాటిల్‌లో గత వారాంతం ఉష్ణోగ్రతలు 1894 నాటి రికార్డులను బద్దలుగొట్టాయని చెబుతున్నారు. అన్ని పట్టణాల్లోనూ ఇదే పరిస్థితి. ప్రతిచోటా పాత రికార్డులు బద్దలవుతున్నాయి. కాలిఫోర్నియా పాల్‌స్ప్రింగ్స్‌లో 47 డిగ్రీల సెల్సియస్‌పైగా నమోదైంది.

కొవిడ్‌ నియంత్రణల సడలింపు

వాతావరణాన్ని స్ప్రేయర్స్​ ద్వారా చల్లబరచటం
రోడ్లను చల్లబరుస్తున్న అధికారులు

తాజా ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకొని వాషింగ్టన్‌లో కొవిడ్‌ నియంత్రణలను కూడా సడలించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే కూలింగ్‌ సెంటర్లలో ప్రజల్ని పూర్తిగా అనుమతించాలని నిర్ణయించారు. ఏసీ థియేటర్లు, షాపింగ్‌ మాల్‌లలో పూర్తిగా ప్రజల్ని అనుమతించనున్నారు. అలాగే స్విమ్మింగ్‌ పూల్స్​లోకి కూడా! టెక్సాస్, కాలిఫోర్నియాల్లో.. విద్యుత్‌ గ్రిడ్‌ ఆపరేటర్లను అప్రమత్తం చేశారు.

విద్యుత్ సమస్య..

వేడి తాపానికి సముద్రం ఒడ్డున సేద తీరుతున్న ప్రజలు
భానుడి ప్రతాపం

ఎండల కారణంగా విద్యుత్‌ వినియోగం అనూహ్యంగా పెరుగుతుండటంతో గ్రిడ్‌కు సమస్యలు తలెత్తవచ్చని అధికారులు భావిస్తున్నారు. అడవుల్లో కార్చిచ్చు ప్రమాదాలు కూడా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కాలిఫోర్నియాలోని కొన్ని ప్రాంతాల్లో మంచినీటి సరఫరాను తగ్గిస్తున్నారు. కెనడాలో కూడా భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదివారం బ్రిటిష్‌ కొలంబియాలో ఉష్ణోగ్రత 46.6 డిగ్రీల సెల్సియస్‌!

హీట్‌డోమ్‌ కారణం

పసిఫిక్‌ మహా సముద్రంలో ఉష్ణోగ్రతల్లో తేడా వల్ల ఏర్పడే హీట్‌డోమ్‌ కారణంగా ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. పర్యావరణ మార్పుల కారణంగానే ఇవన్నీ సంభవిస్తున్నాయన్నారు. ఇలా ఉష్ణోగ్రతలు పెరగటం ఇకమీదట మామూలవుతుందన్నారు.

సముద్ర తీరం ఎదుట సేద తీరుతున్న ప్రజలు

దీనికి అంతా అలవాటు పడాల్సిందేనని కాలిఫోర్నియా యూనివర్సిటీలో వాతావరణ నిపుణుడు డేనియల్‌ స్వెయిన్‌ వ్యాఖ్యానించారు. వచ్చే మూడు నెలల పాటు ఉష్ణోగ్రతలు భారీగానే నమోదవుతాయని అమెరికా వాతావరణ విభాగం అంచనా వేస్తోంది.

ఇదీ చదవండి :బాలుడి చేతికి ఫోన్- లక్షల కారు అమ్ముకున్న తండ్రి!

ABOUT THE AUTHOR

...view details