కొవిడ్-19 వ్యాప్తిని అడ్డుకునే సామర్థ్యం ఒక యాంటీవైరల్ ఔషధానికి ఉన్నట్లు అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ మహమ్మారి ఉద్ధృతికి కళ్లెం వేయడానికి దీన్ని ఒక మార్గంగా ఉపయోగించుకోవచ్చని తేల్చారు. జార్జియా స్టేట్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ ఆవిష్కారం చేశారు.
మోల్నుపిరావిర్ అనే ఈ యాంటీ వైరల్ ఔషధాన్ని తొలుత ఇన్‌ఫ్లూయెంజా వైరస్ల కోసం అభివృద్ధి చేశారు. శ్వాసకోశ వ్యవస్థలో ఇన్ఫెక్షన్లు కలిగించే ఆర్ఎన్ఏ వైరస్‌లపై మోల్నుపిరావిర్ సమర్థంగా పనిచేస్తుందని ఇప్పటికే రుజువైంది. ఇన్ఫెక్షన్ సోకిన జంతువులకు నోటి ద్వారా ఈ ఔషధాన్ని ఇచ్చినప్పుడు.. వాటి నుంచి బయటకు వెలువడే వైరల్ రేణువులు గణనీయంగా తగ్గుతాయని ప్రయోగాల్లో తేలింది. ఫలితంగా వైరస్ వ్యాప్తి నాటకీయంగా తగ్గిందని వెల్లడైంది. ఈ లక్షణాల కారణంగా మోల్నుపిరావిర్‌ను కొవిడ్ కట్టడికి అనువైన మందుగా గుర్తించారు. ప్రజలందరికీ టీకా వేసేలోగా కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయడం చాలా కీలకం.
" ఇది నోటి ద్వారా తీసుకునే మందు. కరోనా వ్యాప్తిని వేగంగా అడ్డుకునే సామర్థ్యమున్న ఔషధాన్ని గుర్తించటం ఇదే మొదటిసారి. ఇది విప్లవాత్మక మార్పులు తెస్తుంది."