తొలిసారి నేరుగా నిర్వహిస్తున్న క్వాడ్ సదస్సులో పాల్గొనేందుకు అమెరికాలో పర్యటిస్తున్న ప్రధాని మోదీ.. గురువారం ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్‌తో భేటీ అయ్యారు. ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసుకోవడం, ప్రజల మధ్య సంబంధాలను మెరుగుపర్చుకోవడం వంటి అంశాలపై వారు చర్చించారని ప్రధానమంత్రి కార్యాలయం ట్విట్టర్ వేదికగా తెలిపింది.
"భారత్-ఆస్ట్రేలియా మధ్య మైత్రి బంధాన్ని మరింత మెరుగుపరుచుకునే లక్ష్యంగా ఇరు దేశాల ప్రధానుల మధ్య చర్చలు జరిగాయి. రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసుకోవడం, ప్రజల మధ్య సంబంధాలను మెరుగుపర్చుకోవడం వంటి అంశాలపై వారు చర్చించారు."
-ప్రధానమంత్రి కార్యాలయం
భారత్-అమెరికా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంపై ఆస్ట్రేలియా ప్రధాని, మోదీల మధ్య ఫోన్ కాల్ సంభాషణ జరిగిన వారం తర్వాత.. వీరిరువురి మధ్య ప్రత్యక్ష భేటీ జరగడం ఇదే తొలిసారి.
'ఇదో కొత్త అధ్యాయం'
మోదీ, మోరిసన్ల మధ్య భేటీ.. ఆస్ట్రేలియాతో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంలో సరికొత్త అధ్యాయం అని విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ట్విట్టర్ వేదికగా తెలిపారు.