తమ టీకా విషయంలో మరో ఊరటనిచ్చే విషయం పంచుకుంది మోడెర్నా సంస్థ. తాము అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ భద్రపరిచేందుకు సాధారణ రిఫ్రిజిరేటర్లు (2 నుంచి 8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత) సరిపోతాయని చెబుతోంది. ఈ విధానంలో 30రోజుల పాటు నిల్వ ఉంచడం సాధ్యమేనని అంటోంది. వైరస్‌ను ఎదుర్కోవడంలో తమ టీకాకు 95శాతం సమర్థత ఉన్నట్లు ఇటీవలే ప్రకటించింది ఈ సంస్థ.
దీనితో లాభం ఏంటి?
వ్యాక్సిన్ అభివృద్ధి చేయడం ఎంత కీలకమో, ఆ టీకాను భద్రపరిచి వివిధ ప్రాంతాలకు సరఫరా చేయడం కూడా అంతే ముఖ్యం. ఈ నేపథ్యంలో ఫైజర్ అభివృద్ధి చేసిన టీకా మైనస్ 70డిగ్రీల సెల్సియస్ అతిశీతల ఉష్ణోగ్రత వద్ద నిల్వ ఉంచాల్సి రావడం అతిపెద్ద సవాల్‌గా మారింది. అంతేకాకుండా సాధారణ రిఫ్రిజిరేటర్లలో కేవలం ఐదురోజులు మాత్రమే నిల్వచేయవచ్చని తెలపడంతో వ్యాక్సిన్ పంపిణీ తీవ్ర చర్చనీయాంశమైంది. అతి కనిష్ఠ ఉష్ణోగ్రతలతో టీకాను మారుమూల ప్రాంతాలకు తరలించడం అతిపెద్ద సవాల్ అనే భావన అటు నిపుణులు, అధికారుల్లో వ్యక్తమైంది. ఇందుకోసం భారీగా ఖర్చు చేయాల్సి వస్తుందనే ఆందోళన మొదలయ్యింది. మోడెర్నా సంస్థ టీకాను రిఫ్రిజిరేటర్‌లోనే నిల్వ చేయడం సాధ్యమైతే కోల్డ్ స్టోరేజీ సమస్యను అధిగమించవచ్చని నిపుణులు అంటున్నారు.
పేద దేశాలకు ఊరటనిచ్చేలా..
అయితే, మోడెర్నా తయారు చేసిన వ్యాక్సిన్‌కు ఇలాంటి ఇబ్బందులేవీ ఉండవని ప్రకటించింది. కేవలం సాధారణ రిఫ్రిజిరేటర్లతోనే దాదాపు నెలరోజుల పాటు టీకాను నిల్వ ఉంచుకోవచ్చని పేర్కొంది. అయితే, టీకా సరఫరాపై మోడెర్నా ఇప్పటివరకు అభివృద్ధి చెందిన దేశాలతోనే ఒప్పందం కుదుర్చుకుంది. తాజాగా రిఫ్రిజిరేటర్లలోనే టీకా నిల్వ చేయవచ్చని వస్తోన్న వార్తలతో అభివృద్ధి చెందుతున్న దేశాలతో పాటు పేద దేశాలకు ఊరట కలుగుతోంది. ఇలాంటి నేపథ్యంలో, ఫైజర్ కూడా టీకా నిల్వ సమస్యను పరిష్కరించే మార్గం కోసం అన్వేషిస్తోంది.