అమెరికా బయోటెక్నాలజీ కంపెనీ మోడెర్నా రూపొందించిన కొవిడ్ టీకా 94.1 శాతం సమర్థతతో పనిచేస్తున్నట్లు తేలింది. మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ప్రాథమిక ఫలితాల విశ్లేషణలో ఈ విషయం వెల్లడైంది. ఈ వివరాలు 'న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్'లో ప్రచురితమయ్యాయి.
ట్రయల్స్‌లో భాగంగా 30 వేల మందికి టీకా, ప్లాసిబో ఇచ్చారు. ఇందులో ఎంపిక చేసిన ఫలితాలను తాజా అధ్యయనం విశ్లేషించింది. టీకా తీసుకున్నవారిలో 11 మందికి కరోనా సంబంధిత లక్షణాలు కనిపించగా.. ప్లాసిబో తీసుకున్నవారిలో 185 మందికి లక్షణాలు కనిపించాయి. ప్లాసిబో తీసుకున్నవారిలోనే తీవ్రమైన వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి.
ఇవి ప్రాథమిక ఫలితాలేనని, పూర్తి వివరాలను విశ్లేషించిన తర్వాత టీకా సమర్థత మరింత పెరుగుతుందని పరిశోధకులు తెలిపారు.
"టీకా ట్రయల్స్ ఫలితాలపై అధ్యయనం కొనసాగుతోంది. వ్యాక్సిన్ పనితీరుపై కావాల్సిన సమాచారం వచ్చే కొద్ది నెలల్లో పూర్తిగా అందుబాటులోకి వస్తుంది. ఇప్పటివరకు విడుదలైన ఫలితాల్లోనైతే టీకా 94.1 శాతం సమర్థతతో పనిచేసినట్లు తేలింది. ఈ ఫలితాలు ఉత్సాహకరంగా ఉన్నాయి."