అమెరికాను ప్రకృతి విపత్తులు వణికిస్తున్నాయి. టెక్సాస్, ఒక్లాహోమా, టెన్నేసీ, ఇల్లీనోయిస్ రాష్ట్ర ప్రజలు మంచు తుపానుతో ఇక్కట్లు పడుతున్నారు. మరోవైపు ఉత్తర కరోలినా రాష్ట్రంలో టోర్నడోల ప్రభావం తీవ్రంగా ఉంది. ఈనెల 14 నుంచి ఇప్పటివరకు మంచు తుపానుకు 11 మంది ప్రాణాలు కోల్పోగా, టోర్నడోకు ముగ్గురు బలయ్యారు.
ప్రాణాలు అరచేతిలో..
కొద్దిరోజులుగా తీవ్రమైన హిమపాతంతో ఉక్కిరిబిక్కిరవుతున్న టెక్సాస్‌లో పరిస్థితి ఇంకా చక్కబడలేదు. విద్యుత్ సరఫరాలో అంతరాయం వల్ల 40 లక్షల ఇళ్లు, దుకాణాలపై ప్రభావం పడింది. రక్తం గడ్డం కట్టించే చలిని ఎదుర్కొనే హీటర్లు పనిచేయక ప్రజలు అవస్థలు పడుతున్నారు. రహదారులు మంచుతో నిండిపోయిన పరిస్థితుల్లో అనేక మంది ఇళ్లకే పరిమితమవుతున్నారు.
"పరిస్థితి మరింత అధ్వానంగా మారే ప్రమాదం ఉంది. విద్యుత్ వ్యవస్థ కుప్పకూలకుండా ఉండాలంటే వీలైనంత వరకు కరెంటును సరఫరాను నిలిపివేయడమే మంచిది."
-అధికారులు
చలి పులిని ఎదుర్కొనేందుకు టెక్సాస్ రాష్ట్ర అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఆస్పత్రులు, నర్సింగ్ హోంలకు విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నారు. ఫెడరల్ ప్రభుత్వం నుంచి జనరేటర్లు తెప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. విద్యుత్ బ్లాక్ఔట్ అయిన ప్రాంతాల్లో ప్రజలు చలిని తట్టుకునేందుకు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు.