క్యూబా కమ్యూనిస్టు పార్టీ నేతగా మిగ్యూల్ డయాజ్ కానెల్ ఎన్నికయ్యారు. ఈ నియామకానికి పార్టీ కాంగ్రెస్ సోమవారం ఆమోదముద్ర వేసింది. పార్టీ ప్రస్తుత ఫస్ట్ సెక్రటరీ రౌల్ క్యాస్ట్రో నిర్వర్తిస్తున్న బాధ్యతల్ని ఇకపై కానెల్ చేపడతారు.
క్యాస్ట్రోల కుటుంబంతో సంబంధంలేని వ్యక్తి మొదటిసారి ఈ బాధ్యతలు చేపడుతున్నారు. అయితే ఇతను క్యాస్ట్రోలకు అత్యంత సన్నిహితుడన్న పేరుంది. డయాజ్ కానెల్ 2018లోనే క్యూబా అధ్యక్షుడయ్యారు. క్యాస్ట్రోలు నిర్వహించిన గెరిల్లా పోరాటాల్లో ఎన్నడూ పాల్గొనకపోయినా.. దేశంలో ఒక సాధారణ సైనికుడిగా మాత్రం పనిచేశారు.