ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కొవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు శాస్త్రవేత్తలు, పరిశోధకులు వ్యాక్సిన్ ప్రయోగాలు ముమ్మరంగా జరుపుతుండగా.. వీటిపై హ్యాకర్ల కన్ను పడింది. ప్రముఖ ఫార్మా కంపెనీలు, వ్యాక్సిన్ పరిశోధకుల నుంచి విలువైన డేటాను చోరీ చేసేందుకు రష్యా, ఉత్తరకొరియా హ్యాకర్లు ప్రయత్నించినట్లు మైక్రోసాఫ్ట్ గుర్తించింది. ఈ మేరకు ఐటీ సంస్థ తన బ్లాగులో పేర్కొంది.
భారత్, కెనడా, దక్షిణకొరియా, అమెరికాలోని కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలను లక్ష్యంగా చేసుకుని వీరు హ్యాకింగ్‌కు యత్నించినట్లు మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. చాలా వరకు హ్యాకర్లు విఫలమైనట్లు తాము గుర్తించామని స్పష్టం చేసింది. అయితే ఎంతమంది హ్యాకర్లు డేటా చోరీకి పాల్పడ్డారో, వారు ఎంత ప్రమాదకరమనేది తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని తెలిపింది. రష్యా మిలిటరీ ఏజెంట్స్‌కు చెందిన ఫ్యాన్సీ బీర్, ఉత్తరకొరియాకు చెందిన లజారస్ గ్రూప్ వంటివి హ్యాకింగ్‌కు యత్నించినట్లు మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. ఫార్మా కంపెనీలు, వ్యాక్సిన్ పరిశోధకులు లాగిన్ వివరాలను చోరీ చేసేందుకు ప్రయత్నాలు జరిగినట్లు తెలిపింది.