MeToo bill: మహిళల లైంగిక వేధింపులకు సంబంధించిన బిల్లుకు అమెరికన్ కాంగ్రెస్ గురువారం ఆమోదం తెలిపింది. పని ప్రదేశాల్లో లైంగిక వేధిపులను ఎదుర్కొనే మహిళలు ఎవరైనా సరే కోర్టులను ఆశ్రయించేలా బిల్లును రూపొందించింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ బిల్లుపై సంతకం చేసిన తరువాత ఇది చట్టంగా అమలులోకి రానుంది. ఈ బిల్లుకు ఆమోదం తెలపడం మీటూ ఉద్యమానికి సంబంధించి కీలక ఘట్టంగా మద్దతుదారులు చెప్తున్నారు.
ఇప్పటివరకు లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులు చాలా వరకు కోర్టులో కాకుండా మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని యాజమాన్యాలు ఉద్యోగులకు సూచించేవి. లేకపోతే ఉద్యోగస్థులను తొలగించడం లాంటివి చేసేవారు. తాజాగా వచ్చిన ఈ బిల్లుతో మహిళా ఉద్యోగులకు భద్రతతో పాటు కోర్టులకు వెళ్లే హక్కుని ఈ చట్టం కల్పిస్తుంది.
మీటూ ఉద్యమానికి నాయకత్వం వహించిన సెనేటర్ కిర్‌స్టెన్ గిల్లిబ్రాండ్ అమెరికన్ చరిత్రలో ఈ బిల్లు ముఖ్యమైన కార్యాలయ సంస్కరణల్లో ఒకటిగా పేర్కొన్నారు. లైంగిక వేధింపులకు సంబంధించి నిర్వహించే మధ్యవర్తిత్వ ప్రక్రియ రహస్యంగా జరగడం పక్షపాతంతో కూడుకున్నదని అన్నారు. ఇది ప్రజల ప్రాథమిక రాజ్యాంగ హక్కును కాలరాస్తోందని పేర్కొన్నారు. మిలిటరీలో లైంగిక వేధింపులపై గ్లిలి బ్రాండ్.. దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. 2017లోనే ఈ చట్టాన్ని సేన్ లిండ్సే గ్రాహంతో కలిసి ప్రవేశ పెట్టారు.