తెలంగాణ

telangana

ETV Bharat / international

ఓడింది ట్రంప్​ మాత్రమే.. 'ట్రంపిజం' కాదు!

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారీ స్థాయిలో విజయాన్ని దక్కించుకున్న జో బైడెన్​.. తన సహచర డెమొక్రాట్లను మాత్రం గెలిపించుకోలేకపోయారు. సెనేట్​లో ఆధిపత్యం చెలాయించాలన్న కలను నెరవేర్చుకోలేకపోయారు. మరోవైపు ట్రంప్​ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ప్రజలు ట్రంప్​ను ఓడించినా.. అన్నివేళలా ఆయనకు అండగా నిలిచిన రిపబ్లికన్లను మాత్రం గెలిపించారు. ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తే.. ఓడింది ట్రంప్​ మాత్రమేనని.. ట్రంపిజం కాదని అర్థమవుతోంది.

Message of Election 2020: Trump lost, but Trumpism did not
ఓడింది ట్రంప్​ మాత్రమే.. 'ట్రంపిజం' కాదు!

By

Published : Nov 8, 2020, 5:05 PM IST

రిపబ్లికన్​ అభ్యర్థి డొనాల్డ్​ ట్రంప్​ను ఓడించి ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన అధ్యక్ష పీఠాన్ని అధిరోహించనున్నారు జో బైడెన్​. ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడనప్పటికీ.. బైడెన్​ 306 ఎలక్టోరల్​ ఓట్లు దక్కించుకుంటారని అంచనా. ఇది నాలుగేళ్ల క్రితం ట్రంప్​ సాధించిన ఓట్లకు దాదాపు సమానం. అయితే ఈ ఎన్నికల్లో నిజానికి ఓడింది ట్రంప్​ మాత్రమే... 'ట్రంపిజం' కాదు!

బైడెన్​ గెలిచినా...

306 ఓట్లు అంటే బైడెన్​ భారీ స్థాయిలో గెలుపొందినట్టే. కానీ ఇక్కడ మరో విషయాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తే అమెరికన్ల ఆలోచనలు అర్థమవుతాయి. ఆ స్థాయిలో విజయాన్ని దక్కించుకున్న బైడెన్​.. తన సహచర డెమొక్రాట్లను మాత్రం గెలిపించుకోలేకపోయారు. అటు సెనేట్​కు, ఇటు ప్రతినిధుల సభకు పోటీపడ్డ అనేకమంది డెమొక్రాట్లు ఓడిపోయారు. ఇప్పటికే ఆయా సభల్లో ప్రతినిధులుగా ఉన్న వారూ ఓటమి పాలవడం గమనార్హం.

ఇదీ చూడండి:-బైడెన్ ప్రభుత్వ ఏర్పాటు సాఫీగా సాగేనా?

ట్రంప్​ పరిస్థితి ఇందుకు భిన్నం. ఆయనకున్న ప్రజాదరణ మాత్రం ఇతర రిపబ్లికన్లకు చాలా ఉపయోగపడింది. అధికారంలో ఉన్న రిపబ్లికన్లకు తిరిగి వారి స్థానాలనిచ్చింది. కానీ ట్రంప్​ మాత్రం గట్టెక్కలేకపోయారు. బైడెన్​ను మినహాయిస్తే.. ఏ ఇతర అధ్యక్ష అభ్యర్థికీ దక్కని ఓట్లు ట్రంప్​ తన ఖాతాలో వేసుకున్నారు. అయినా లాభం లేకుండా పోయింది.

సెనేట్​లో డీలా..

గ్రామీణ- చిన్న పట్టణాలున్న ప్రాంతాల్లో ట్రంప్​ ఓట్లు రాబట్టగలిగారు. నగరాల్లో బైడెన్​కు మద్దతు లభించింది. బైడెన్​కు భారీ స్థాయిలో ఎలక్టోరల్​ ఓట్లు దక్కినా.. రాజకీయపరంగా దేశం ఇంకా రెండుగా చీలిపోయే ఉందని తెలుసుకోవడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు.

వీటన్నిటినీ పరిశీలిస్తే... ప్రజల ఆగ్రహం కేవలం ట్రంప్​పైనేనని, రిపబ్లికన్ పార్టీ సిద్ధాంతాలపై కాదని అర్థమవుతోంది.

పని చేసిన ట్రంప్​ 'మాయ'..

ఎన్నికల ప్రచారాల్లో ట్రంప్​ అనేక ప్రాంతాల్లో సుడిగాలి పర్యటనలు చేశారు. తమ పార్టీని గెలిపించుకునేందుకు తీవ్రంగా శ్రమించారు. ఇది రిపబ్లికన్లను మరింత బలపరించిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రిపబ్లికన్లకు ఆదరణ ఉన్న ప్రాంతాల్లో ఓట్లు మరింత పెరగడం ఇందుకు నిదర్శనమని చెబుతున్నారు.

వ్యక్తిత్వమే కొంపముంచిందా?

నిజానికి అనేకమంది ఓటర్లకు ట్రంప్​ విధానాలతో ఇబ్బందులు లేవు. చైనాతో వాణిజ్య యుద్ధంలో ఆయన తీసుకున్న నిర్ణయాలను అనేక మంది ప్రశంసించారు. వారికి ఉన్న ఇబ్బందులన్నీ ఆయన వ్యక్తిత్వంతోనే. ట్రంప్​ ఆగ్రహం, కీలక విషయాల్లో ఆయన వైఖరినే వారు వ్యతిరేకించారు. ట్విట్టర్​ను ఆయన ఆయుధంగా చేసుకోవడం, తనను వ్యతిరేకించిన వారిపై ఆయన చేసే మాటల దాడిని ఓటర్లు తట్టుకోలేకపోయారు.

ఇదీ చూడండి:-ఓటమికి ముందు ట్రంప్‌ ఏం చేశారంటే...

ఈ విషయాన్ని పసిగట్టిన బైడన్​.. అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు రచించారు. ట్రంప్​ తన పాలనతో పోగొట్టిన 'అమెరికా గౌరవా'న్ని తాను పునరుద్ధరిస్తానని ప్రచారాలు చేశారు. ఫలితంగా అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్నారు.

చరిత్రకు అతీతంగా..

అధ్యక్ష పదవిలో ఉండి మరోమారు ఎన్నికవ్వకపోవడం అమెరికా చరిత్రలో.. ట్రంప్​తో కలిపి నాలుగుసార్లు జరిగింది. అయితే అంతుకుముందు అధ్యక్షుల పరిస్థితిని పరిశీలిస్తే.. ఆయా సందర్భాల్లో విపక్ష పార్టీలు భారీగా లాభపడ్డాయి. అటు సెనేట్​లోనూ, ఇటు ప్రతినిధుల సభలోనూ తమ ఆధిపత్యాన్ని చెలాయించాయి.

కానీ 2020 అధ్యక్ష ఎన్నికలు మాత్రం చరిత్రకు అతీతం. రిపబ్లికన్లు సెనేట్​లో తమకున్న ఆధిపత్యాన్ని తిరిగి దక్కించుకున్నారు. ట్రంప్​ను ఓడించినా... నాలుగేళ్లపాటు ఆయనకు అన్ని విధాలుగా అండగా నిలిచి, అధ్యక్షుడి పట్ల తమ నిబద్ధతను చాటుకున్న వారిని అమెరికన్లు మరోమారు గెలిపించారు.

ఇదీ చూడండి:-'మొండిగా ఆరోపించడమా.. హుందాగా వైదొలగడమా?'

ABOUT THE AUTHOR

...view details