తెలంగాణ

telangana

ETV Bharat / international

'కరోనా కట్టడిలో ట్రంప్ ప్రభుత్వానికి మైనస్ మార్కులే' - అమెరికాలో కరోనా వైరస్

కరోనాపై పోరాటంలో అగ్రరాజ్య స్థాయి కృషి కనిపించడం లేదని విమర్శించారు బిల్​గేట్స్ సతీమణి మిలిందా గేట్స్​ . కరోనా కట్టడిలో డొనాల్డ్​ ట్రంప్​ ప్రభుత్వ కృషికి మైనస్​ మార్కులు వేస్తానని అన్నారు. అంతర్జాతీయంగానూ పేద దేశాలను ఆదుకునే బాధ్యత అమెరికాపై ఉందని అభిప్రాయపడ్డారు.

VIRUS-US-MELINDA
కరోనా కట్టడి

By

Published : May 8, 2020, 11:02 PM IST

అమెరికాలో కరోనా వైరస్​ విజృంభణపై బిల్​గేట్స్ సతీమణి మిలిందా గేట్స్ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా విపత్తును ఎదుర్కోవటంలో ట్రంప్ ప్రభుత్వం విఫలమైందని తీవ్ర విమర్శలు చేశారు. అమెరికాలో కరోనా వ్యాప్తిని నిర్మూలించేందుకు నిర్ధరణ పరీక్షలు, కాంటాక్ట్​ ట్రేసింగ్​ విస్తృతంగా చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రాణాంతక వైరస్​ను అరికట్టే విషయంలో జాతీయ స్పందనకు సంబంధించి ప్రభుత్వ కృషికి మైనస్​ మార్కులు వేస్తానని ఆమె చెప్పారు. ఇటువంటి ఆరోగ్య సంక్షోభంలో జాతీయ స్థాయికి బదులుగా రాష్ట్రాల్లోని గవర్నర్లు స్థానిక పరిష్కారాలకే మొగ్గు చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

"కరోనా నిర్ధరణ పరీక్షలు, వ్యాక్సిన్ అభివృద్ధికి మరిన్ని నిధులు కావాలి. జర్మనీ తరహాలో పరీక్షలు చేస్తేనే వైరస్​ను నియంత్రించగలం. కాంటాక్ట్ ట్రేసింగ్​ను విస్తృతంగా చేపట్టాలి. ఆరోగ్యపరంగా దేశం క్షేమంగా ఉందని భావిస్తేనే కార్యకలాపాలను నెమ్మదిగా ప్రారంభించాలి. కానీ ఇక్కడ సమష్టి కృషి లేదు. అంతర్జాతీయంగానూ అమెరికా స్పందన నామమాత్రంగానే ఉంది."

- మిలిందా గేట్స్​

ఆఫ్రికాలో చూస్తే ప్రస్తుతం ప్రారంభ దశలోనే ఉందని.. భవిష్యత్తులో ఆహార కొరత, ఆరోగ్య సమస్యలు తీవ్రమయ్యే అవకాశం ఉందని గేట్స్​ అంచనా వేశారు. ఇది క్రమంగా ఐరోపా, అనంతరం అమెరికాపై ప్రభావం చూపుతుందన్నారు. అందువల్ల అంతర్జాతీయంగా పరిస్థితి తీవ్రంగా ఉన్న దేశాలను అమెరికా ఆదుకోవాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details