కరోనా కట్టడికి ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ నగరంలో మరోసారి లాక్‌డౌన్‌ను పొడిగించారు అక్కడి అధికారులు. డెల్టా వేరియంట్‌ను అడ్డుకునేదుకు సిడ్నీలో కేవలం టీకా వేయించుకున్న వారికి మాత్రమే ఆంక్షలను నుంచి మినహాయింపు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నారు. సిడ్నీలో కొత్తగా 344 కరోనా కేసులు వెలుగు చూశాయి.
ఇటు దక్షిణ కొరియాలో కేసుల లోడ్ రోజురోజుకు ఎక్కువ అవుతోంది. బుధవారం ఒక్కరోజే 2వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా ఇంత పెద్ద మొత్తంలో కేసులు వెలుగులోకి రావడం ఇదే తొలిసారి.
అమెరికా విలవిల
అమెరికాలోని ఫ్లోరిడాలో కరోనా కారణంగా ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య భారీగా పెరిగింది. ఇప్పటికే ఆసుపత్రుల్లో బెడ్లు పూర్తిస్థాయిలో నిండిపోవడం వల్ల అత్యవసర సేవలకు అంబులెన్స్ సర్వీసులను, అగ్నిమాపక విభాగాలను ప్రభుత్వం ఉపయోగించుకుంటోంది. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని ఓ ఆసుపత్రిలో రోగులు చేరేందుకు సుమారు గంటపైనే సమయం పడుతోంది. చాలా మంది అంబులెన్స్‌లలో వేచి ఉంటున్నారు.
అమెరికాలో ఈ మంగళవారం ఒక్కరోజే లక్షకు పైగా కేసులు నమోదు కాగా.. 657 మంది వైరస్ కారణంగా చనిపోయారు.
ఇతర దేశాల్లో కరోనా వైరస్ ఉద్ధృతి ఇలా..
- ఇరాన్:అగ్రరాజ్యం తర్వాత వైరస్ ఉద్ధృతి అధికంగా ఉంది ఇరాన్‌లోనే. ఆంక్షల సడలింపు, ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్న నేపథ్యంలో వైరస్ పంజా విసురుతోంది. మంగళవారం ఒక్కరోజే దాదాపు 40వేల కొత్త కేసులు బయటపడ్డాయి. 508 మంది మరణించారు. 25వేల మందికిపైగా వైరస్‌ను జయించారు.
- బ్రెజిల్:డెల్టా వేరియంట్ వ్యాప్తి బ్రెజిల్లో అధికంగా ఉంది. దీంతో దేశవ్యాప్తంగా ఒక్కరోజే 35వేలకుపైగా కొత్త కేసులు వెలుగు చూశాయి. 1,183 మంది ప్రాణాలు కోల్పోయారు. 83వేల మంది వైరస్ నుంచి కోలుకున్నారు.
- ఇండోనేసియా:కరోనా కేసులు అదుపులోకి వచ్చినా.. మరణాలు తగ్గటం లేదు. మంగళవారం కొత్తగా 32వేల కేసులు నమోదయ్యాయి. 2,048 మంది మరణించారు.
- ఫ్రాన్స్:ఫ్రాన్స్‌లో 28వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. మంగళవారం 68 మంది మరణించారు.
- టర్కీ:దేశవ్యాప్తంగా ఆంక్షలు సడలించిన క్రమంలో వైరస్ మళ్లీ పుంజుకుంటోంది. మంగళవారం కొత్తగా 26వేలకుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. 124 మంది మరణించారు.
ఇదీ చూడండి:కార్చిచ్చు విధ్వంస చిత్రం- ఆ దేశాలు హడల్