ఊబకాయం.. యువత నుంచి వయసు మళ్లిన వారి వరకు ఇప్పుడిదో పెద్ద సమస్య. నాజూగ్గా కనిపించాలని చాలామంది అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో వారు చేసే కొన్ని పనులు లేనిపోని అనారోగ్యాలకు దారితీస్తున్నాయి. అయితే ఓ చిట్కా పాటించడం వల్ల సులభంగా బరువు తగ్గొచ్చని చెబుతోందీ అధ్యయనం.
కెవిన్ కెల్లీ, ఓవెన్ మైక్గెన్నీస్, కార్ల్ జాన్సన్, వండర్బిల్ట్ విశ్వవిద్యాలయానికి చెందిన కొంతమంది కలసి ఈ అధ్యయనం చేశారు. 'పీఎల్ఓఎస్ బయోలజీ' అనే జర్నల్‌లో ఈ అధ్యయనం ప్రచురితమైంది.
ఇదే ప్రధానం..
రోజూ మనం ఎన్ని కేలరీల ఆహారం తీసుకుంటున్నామనేది ముఖ్యం కాదు ఏ సమయంలో తింటున్నామనేది ప్రధానమని ఈ అధ్యయనం చెబుతోంది.
ఈ మూడింటిపై...
సాధారణంగా బరువు పెరగడం, తగ్గడం అనేది ఈ మూడు విషయాలపై ఆధారపడి ఉంటుంది.
⦁ ఏం తింటున్నాం?
⦁ ఎంత తింటున్నాం?
⦁ ఎంత సమయం వ్యాయామం చేస్తున్నాం?
మీరు తినే ఆహారం ఏ మేరకు జీర్ణం అవుతుంది అనేది రోజువారీ దినచర్య, నిద్రపోయే సమయాలపై ఆధారపడి ఉంటుందని ఈ అధ్యయనం చెబుతోంది.
సర్వే చేశారిలా
'రేండమ్ క్రాస్ఓవర్' అనే ప్రయోగం ద్వారా మధ్య వయస్కులు, పెద్దల జీవక్రియను వేర్వేరుగా 56 గంటల పాటు రెండు సెషన్స్‌లో పర్యవేక్షించారు.
ప్రతి సెషన్లో వీరికి మధ్యాహ్నం 12:30కు లంచ్, సాయంత్రం 5:45కు రాత్రి భోజనాన్ని అందించారు. అయితే మూడో భోజనం ఈ రెండు సమయాలకు భిన్నంగా అందించారు.
మొదటి 56 గంటల్లో 8 గంటలకు అల్పాహారం, రాత్రి 10 గంటలకు చిరుతిళ్లను అందించారు. రాత్రి సమయాల్లో చిరుతిళ్లు తీసుకోవడం వల్ల బరువు పెరగడం అధికంగా ఉంటుందని వీరు గుర్తించారు. అదే ఉదయం పూట అల్పాహారం తినడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. దీనివల్ల బరువు తగ్గడం సులభం అవుతుందని పేర్కొన్నారు.
రాత్రి భోజనం, ఉదయం అల్పాహారానికి మధ్య ఏం తీసుకోకుండా ఉంటే బరువు తగ్గే అవకాశం ఉందని ఈ అధ్యయనం తేల్చింది.
ఇదీ చదవండి:జమ్ముకశ్మీర్‌లో నలుగురు ఉగ్రవాదులు హతం