తెలంగాణ

telangana

ETV Bharat / international

ఆంక్షల్లేవ్... జాగ్రత్తలతోనే వైరస్​పై పోరు! - కరోనా వైరస్ జాగ్రత్తలు

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్​ రోజురోజుకూ మరింత విజృంభిస్తోంది. లాక్​డౌన్ నుంచి క్రమంగా బయటకు వస్తోన్న నేపథ్యంలో​ మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతోంది. ఈ పరిస్థితుల్లో మళ్లీ లాక్​డౌన్​ జోలికి పోకుండా వ్యక్తిగత జాగ్రత్తలు, ప్రయాణాల ఆంక్షలపై ప్రభుత్వాలు దృష్టి పెడుతున్నాయి.

virus
కరోనా

By

Published : Jun 25, 2020, 6:23 PM IST

అమెరికా సహా చాలా దేశాల్లో కరోనా కేసుల సంఖ్యలో భారీ పెరుగుదల నమోదవుతోంది. ఆంక్షల సడలింపులతో వైరస్ ప్రపంచవ్యాప్తంగా భయంకరమైన స్థాయికి చేరింది. లాక్​డౌన్​ ఫలాలు తుడిచిపెట్టుకుపోయే పరిస్థితుల్లో ప్రభుత్వాలు, వ్యాపార సంస్థలు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.

కరోనాను సమర్థంగా కట్టడి చేసిన కొన్ని దేశాల్లో మళ్లీ వైరస్​ ఉనికి చాటుతోంది. ఒకానొక దశలో కరోనాపై విజయం సాధించినా దక్షిణ కొరియాలోనూ మళ్లీ వైరస్ విజృంభిస్తోంది. గురువారం కొత్తగా మరో 28 కేసులు నమోదయ్యాయి. చైనాలోనూ మళ్లీ మహమ్మారి కోరలు చాస్తోంది.

వ్యాప్తి తగ్గుముఖం పట్టినట్లు కనిపించిన ఆస్ట్రేలియాలోనూ అదే పరిస్థితి నెలకొంది. మెల్​బోర్న్​లోని హాట్​స్పాట్​ జోన్లలో ఇంటిఇంటికీ వెళ్లి సుమారు లక్షమందికి పరీక్షలు చేయాలని ఆరోగ్య శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.

ఇండోనేసియాలో కరోనా వైరస్ కేసులు 50 వేలకు చేరువయ్యాయి.

సడలింపులు..

ప్రజారోగ్యం, ఆర్థిక పరిస్థితులపై ప్రభావం చూపిస్తున్న కరోనా మహమ్మారిని ఎదుర్కొంటూనే ఆంక్షల సడలింపులకు సిద్ధమవుతున్నాయి ప్రపంచ దేశాలు. దుబాయ్​లో తాజాగా రాత్రి పూట కర్ఫ్యూను ఎత్తేశారు. సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించి పగలు, రాత్రి స్వేచ్ఛగా తిరగవచ్చని అక్కడి అధికార మీడియా స్పష్టం చేసింది.

ఐరోపా దేశాలు కూడా జులై 1 నుంచి భాగస్వామ్య దేశాల సరిహద్దులు తెరిచేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే ఐరోపా సమాఖ్య కాకుండా బయట నుంచి వచ్చే సందర్శకులకు అనుమతించటం కష్టమే. ముఖ్యంగా అమెరికా నుంచి వచ్చే వారిపై నిషేధం ఉండవచ్చు. ఎందుకంటే ఐరోపాలో పరిస్థితి తీవ్రంగా ఉన్నప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వారి ప్రయాణాలపై నిషేధం విధించారు.

అగ్రరాజ్యంలో ఇలా..

అమెరికాలో కరోనా తీవ్రత మిగతా దేశాలకన్నా చాలా ఎక్కువగా ఉంది. తాజాగా అక్కడ ఒక్కరోజులో 34,700 కేసులు నమోదయ్యాయి. జాన్​ హాప్కిన్​ విశ్వవిద్యాలయం గణాంకాల ప్రకారం.. అమెరికాలో 1.2 లక్షల మంది చనిపోయారు. 23 లక్షల మంది వైరస్ బారినపడ్డారు.

అయితే ప్రారంభంలో తీవ్రంగా ప్రభావితమైన న్యూయార్క్​, న్యూజెర్సీ రాష్ట్రాల్లో పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు అక్కడి గవర్నర్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారికి 24 రోజుల క్వారంటైన్ తప్పనిసరి చేశాయి.

ఆ రాష్ట్రాల్లో భారీగా..

అమెరికాలోని అరిజోనా, కాలిఫోర్నియా, మిస్సిసిప్పీ, నెవాడా, టెక్సాస్​, ఒక్లహామా రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఉత్తర​ కరోలినా, దక్షిణ​ కరోలినాలో ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య భారీగా ఉంది.

ఈ నేపథ్యంలో కొన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. ఆర్థిక సడలింపులను ఇస్తూనే మాస్కు వినియోగాన్ని తప్పనిసరి చేస్తున్నాయి. వైరస్ నియంత్రించేందుకు చర్యలను చేపడుతున్నాయి. ప్రయాణాలకు సంబంధించి నూతన విధివిధానాలను అమలు చేస్తున్నాయి.

కోటికి చేరువలో కేసులు..

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 95.5 లక్షల మందికి వైరస్ సోకింది. కరోనా బారిన పడి 4.85 లక్షల మంది మరణించారు. అరకోటి మందికిపైగా కోలుకున్నారు.

కరోనా కట్టడికి కొన్ని ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. చాలా దేశాల్లో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిర్ధరణ పరీక్షలు కూడా ఎక్కువ సంఖ్యలో నిర్వహించాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇదీ చూడండి:తుది దశకు ఆక్స్‌ఫర్డ్‌ టీకా- అక్టోబర్​లో రిలీజ్​!

ABOUT THE AUTHOR

...view details