సంచలనాలకు కేరాఫ్ అడ్రస్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. తన వివాదాస్పద నిర్ణయాలు, ట్వీట్లతో నిత్యం వార్తల్లో ఉంటారు ట్రంప్. అధ్యక్షుడిని విమర్శించే వారూ చాలా మందే ఉన్నారు. తాజాగా ఈ జాబితాలోకి అధ్యక్షుడి అన్న కూతురు మేరీ ట్రంప్ చేరారు. ట్రంప్, కుటుంబ వ్యవహరాలను ప్రస్తావిస్తూ ఓ పుస్తకాన్ని రాశారు సైకాలజిస్ట్ మేరీ. దీనికి సంబంధించిన కాపీ అమెరికాలోని ఓ ప్రముఖ వార్తా సంస్థకు అందింది. ఇంకొన్ని నెలల్లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. "ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి ట్రంప్" అంటూ మేరీ చేసిన ఆరోపణలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.
'రెండోసారి గెలిపిస్తే అంతే'
తాను రాసిన "టూ మచ్ అండ్ నెవర్ ఎనఫ్.. హౌ మై ఫ్యామిలీ క్రియేటెడ్ ది వరల్డ్స్ మోస్ట్ డేంజరస్ మ్యాన్" అనే పుస్తకంలో తీవ్ర ఆరోపణలు చేశారు మేరీ ట్రంప్. 'అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం, ఇతరుల్లో విభజన భావాలను సృష్టించడం డొనాల్డ్ ట్రంప్‌కు వెన్నెతో పెట్టిన విద్య' అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
"ఈ పుస్తకాన్ని ప్రచురించే నాటికి.. ట్రంప్ గర్వం, అజ్ఞానం వల్ల వేలాది మంది అమెరికన్ల జీవితాలు నాశనం అయిపోయి ఉంటాయి. అధ్యక్షుడిగా ట్రంప్‌ను రెండోసారి గెలిపిస్తే.. అమెరికాలో ప్రజాస్వామ్యానికి తెరపడినట్టే."
--- మేరీ ట్రంప్, ట్రంప్ అన్న కూతురు.
'ట్రంప్ శాట్స్ రాయలేదు..'
పెద్ద వ్యాపారవేత్త నుంచి అమెరికా అధ్యక్షుడి స్థాయికి ఎదిగిన ట్రంప్.. తన జీవితంలో ఎన్నో మోసాలు చేశారని ఆరోపించారు మేరీ. కళాశాలల్లో ప్రవేశం కోసం నిర్వహించే శాట్స్ పరీక్షను ట్రంప్ రాయలేదని తెలిపారు. ట్రంప్ తన స్నేహితుడితో పరీక్షలు రాయించారని.. ఆ తర్వాత అతడికి భారీ మొత్తంలో సొమ్ములు చెల్లించారని ఆరోపించారు. పుట్టుకతోనే ధనికుడైన ట్రంప్‌కు డబ్బుల కొరత లేదన్నారు.
" అతడి సోదరి మేరీయాన్తో హోంవర్కులు రాయించేవారు ట్రంప్. తన మార్కులు దెబ్బతింటాయేమోనని భయపడేవారు. అప్పటికే ఆయన గ్రేడ్లు సరిగ్గాలేవు. అందువల్ల పరీక్షల్లో గట్టెక్కడానికి జో షాపిరో అనే ప్రతిభావంతుడి చేత తన శాట్స్ పరీక్షలు రాయించారు ట్రంప్. నిధులకు కొరత లేని ట్రంప్.. అతడికి భారీ మొత్తంలో సొమ్ములు చెల్లించారు. "