అమెరికా మిషిగన్‌లో.. కాల్ డన్హమ్(59), లిండా(66).. ఈ నెల తొలి వారంలో అనారోగ్యంతో కొంత ఇబ్బంది పడ్డారు. అయినప్పటికీ.. కుటుంబంతో కలిసి ట్రిప్‌కు వెళ్లారు. అక్కడ వారికి జ్వరం, జలుబు తీవ్రమైంది. మూడు రోజులకే ట్రిప్‌ను అర్ధాంతరంగా వదిలి ఇంటికి వెళ్లారు.
కాల్ డన్హన్-లిండా దంపతులు ట్రిప్ నుంచి వచ్చిన కొన్ని రోజులకే దంపతులిద్దరూ ఆసుపత్రిలో చేరారు. కొవిడ్ సోకినట్టు నిర్ధరణ అయ్యింది. కొన్ని రోజుల పాటు వారిని వెంటిలేటర్‌పై పెట్టి చికిత్స అందించారు. అంతకుముందే వారికి ఇతర అనారోగ్య సమస్యలున్నాయి.
చికిత్స పొందుతూ.. ఆదివారం ఉదయం 11:07 గంటలకు కాల్ మరణించారు. అది జరిగిన ఒక్క నిమిషానికి.. అంటే 11:08కు భార్య లిండా తుదిశ్వాస విడిచారు. ఆ సమయంలో వారిద్దరు చేతిలో చెయ్యి వేసుకునే ఉన్నారు.
టీకా తీసుకున్నా...!
కొవిడ్‌పై పోరాటం కోసం ప్రతి ఒక్కరు టీకా తీసుకోవాలని ప్రోత్సహించేవారు కాల్, లిండా. ఈ ఏడాది మేలోనే వీరూ టీకా తీసుకున్నారు. అలాంటిది కొవిడ్‌తో వీరు మరణించడం బాధాకరం.
లిండాతో పరిచయం ఉన్న వారు ఆమె మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. లిండా చాలా మంచి మనిషి అని, అన్నింట్లోనూ తమకు అండగా ఉంటేవారని గుర్తుచేసుకుంటున్నారు.
బూస్టర్ డోస్ తీసుకోవాల్సిందేనా?
రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్లపై కొవిడ్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది.. టీకా రెండు డోసులు తీసుకున్నప్పటికీ.. వారిలో రోగనిరోధక శక్తి పెరగడం లేదు. అదే సమయంలో రెండు డోసులు తీసుకున్నా.. యాంటీబాడీలు ఎన్ని రోజులు ఉంటాయనేదానిపై స్పష్టత లేదు.
అందువల్ల బూస్టర్ డోసుకు ఇటీవలి కాలంలో డిమాండ్ పెరుగుతోంది. ఒక్లహోమాలో ఓ టీచర్.. కొవిడ్ బారిన పడి మృత్యువు అంచువరకు వెళ్లారు. బూస్టర్ డోసుతో బతికి బయటపడినట్టు ఆమె వివరించారు. కాల్, లిండా దంపతులు బూస్టర్ డోసు తీసుకున్నారా? లేదా? అన్న విషయంపై స్పష్టత లేదు.
అమెరికావ్యాప్తంగా 65శాతం జనాభా కనీసం ఒక్క డోసు తీసుకుంది. 56శాతం జనాభా రెండు డోసులు తీసుకుంది. కాగా.. అగ్రరాజ్య అధ్యక్షుడు జో బైడెన్ సోమవారంబూస్టర్ డోసు తీసుకున్నారు.
ఇదీ చూడండి:-79 వెడ్స్ 66.. వృద్ధాప్యంలో సరికొత్త ప్రయాణం ప్రారంభం