పిజ్జా చేయాలంటే.. ఓవెన్ వాడుతారు ఎవరైనా. కానీ, ఓ వ్యక్తి మాత్రం ఏకంగా అగ్నిపర్వతాన్నే వినియోగిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. డేవిడ్ గార్సియా(34) అనే వ్యక్తి.. గ్వాటెమాలాలోని పకాయ అగ్నిపర్వతం నుంచి వెలువడుతున్న లావాపై పిజ్జా చేస్తూ ఆకట్టుకున్నాడు. దీనికి అగ్నిపర్వతం పేరుతో.. 'పకాయ పిజ్జా'గా నామకరణం చేసి సరికొత్త ట్రెండ్‌ను ప్రాచుర్యంలోకి తీసుకువచ్చాడు.
ప్రత్యేక దుస్తులు ధరించి..
అగ్నిపర్వతంపై పిజ్జాను తయారు చేసేటప్పుడు వేడి నుంచి రక్షణ కోసం ప్రత్యేకమైన దుస్తులు ధరించాడు గార్సియా. వంటకు 1,800 ఫారన్‌హీట్ డిగ్రీల ఉష్ణోగ్రత వరకు తట్టుకునే పాత్రలను వినియోగించాడు. ప్రస్తుతం గార్సియా పిజ్జా వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
"దాదాపు 800 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న లావాపై నేను పిజ్జా చేసేందుకు పెట్టాను. 14 నిమిషాల్లో పిజ్జా సిద్ధమైంది. లావా మీద చేసిన ఈ పిజ్జా భలే రుచిగా ఉంటుంది."
-గార్సియా, పిజ్జా మేకర్