కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న కారణంగా కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది అగ్రరాజ్యం అమెరికా. ప్రజలు బయటకు రాకుండా స్వీయ నిర్బంధలో ఉండాలని ఆదేశించింది. ఇది అమెరికా వాసుల సామాజిక జీవన విధానంలో మార్పులు తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.
భార్యాభర్తలు..
స్వీయ నిర్బంధం భార్యాభర్తల మధ్య పలు సమస్యలకు దారితీస్తోందని చెబుతున్నారు నిపుణులు. ఇప్పటికే భార్యాభర్తల మధ్య వివాదాలుంటే.. అవి మరింత పెరిగే అవకాశం ఉందని ఓ మానిసిక వైద్య నిపుణుడు తెలిపారు. ఇంట్లో భార్యతో కాకుండా బయట వ్యక్తులతో ఎక్కువ సమయం గడిపేవారు భాగస్వామితో గొడవపడటానికి అవకాశం ఉందన్నారు. ఒకవేళ సత్సంబంధాలు ఉంటే అవి ఇంకా మెరగవుతాయని చెప్పారు. తీరిక లేకుండా గడిపే వ్యక్తులకు ఇదో మంచి సువర్ణావకాశమని చెప్పారు.
"తరుచూ గొడవ పడే వారు ఒకే దగ్గర ఎక్కువ సమయం గడిపితే సమస్య మరింత జటిలం అవుతుంది. కరోనా ఆంక్షలతో చైనాలో గృహహింస రేటు పెరిగింది. స్వీయ నిర్బంధం ప్రతికూల పరిస్థితులను తీవ్రతరం చేస్తుంది. సత్సంబంధాలు లేనివారికి ఇల్లు ఎల్లప్పుడూ సురక్షితమైన ప్రదేశం కాదు."
-డాక్టర్ వెండి డికిన్సన్, మానసిక నిపుణురాలు