అగ్రరాజ్యంలో ఆగ్రహజ్వాల- శ్వేతసౌధాన్ని తాకిన సెగ - protest in us today
అమెరికాలో నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్ మృతికి న్యాయం జరగాలని చేపట్టిన నిరసనలు ఉద్ధృతంగా మారాయి. ఈ నిరసనల్లో ఇప్పటివరకు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. శ్వేతసౌధం వద్ద ఆందోళనకారులు గుమిగూడిన నేపథ్యంలో అధ్యక్షుడు ట్రంప్ సహా కుటుంబసభ్యులు అండర్‌గ్రౌండ్‌లో గడిపారు.
ఉద్యమ క్షేత్రంగా అగ్రరాజ్యం
నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్ మృతిపై అమెరికా వరుసగా ఆరో రోజు రణరంగంగా మారింది. ఫ్లాయిడ్‌కు న్యాయం జరగాలంటూ జరుగుతున్న ఈ నిరసనల్లో ఇప్పటివరకు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
- ఆందోళనలను అరికట్టేందుకు 40 నగరాల్లో కర్ఫ్యూ విధించారు. 140 నగరాలు, పట్టణాల్లో నిరసనలు జరుగుతున్నాయి.
- శ్వేతసౌధం వద్ద ఆందోళనకారులు గుమిగూడిన నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిరసనకారులను చెదరగొట్టేందుకు బాష్పవాయువును ప్రయోగించారు.
- శ్వేతసౌధం వద్ద నిరసనలు చెలరేగడం వల్ల అధ్యక్షుడు ట్రంప్, ప్రథమ పౌరురాలు మెలానియా వారి కుమారుడు బారన్ ట్రంప్ అండర్ గ్రౌండ్‌లోని గదిలో గంటపాటు ఉన్నారు.
- నిరసనల వెనక వామపక్ష సంస్థ ఆంటిఫా ఉందని.. దానిని ఉగ్రవాద సంస్థగా తీర్మానిస్తామని ట్విట్టర్ ద్వారా ప్రకటించారు ట్రంప్.
- ఆందోళనలను అణిచేందుకు ఇప్పటికే 5 వేలమంది నేషనల్ గార్డ్స్‌ను మోహరించారు. అవసరమైతే మరో 2 వేలమందిని తరలించనున్నట్లు చెప్పారు.
- ఇప్పటివరకు 24 నగరాల్లోని 2,564 మందిని అరెస్టు చేశారు. లాస్ ఏంజెల్స్‌లోనే అరెస్టులు ఎక్కువగా ఉన్నాయి.
- బర్మింగ్‌హామ్‌లో ఓ స్మారకాన్ని కూల్చేందుకు ప్రయత్నించారు నిరసనకారులు.
- బోస్టన్‌లో ఓ పోలీస్ వాహనానికి ఆందోళనకారులు నిప్పుపెట్టారు.
- ఫిలడెల్ఫియాలో నిరసనకారులను చెదరగొట్టేందుకు పెప్పర్ స్ప్రే వినియోగించారు.