టిక్‌టాక్‌ను కొనుగోలు చేసేందుకు ప్రముఖ అమెరికా సంస్థ ఒరాకిల్ దాఖలు చేసిన బిడ్‌ను పరిశీలిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఈ ఒప్పందంపై ఆమోద ముద్ర వేసే ముందు.. జాతీయ భద్రత విషయంలో రాజీపడకుండా అన్ని చర్యలు చేపడుతున్నట్టు స్పష్టం చేశారు ట్రంప్.
"ఈ ఒప్పందానికి సంబంధించిన అధ్యయనాలు నా దగ్గరకు వస్తున్నాయి. జాతీయ భద్రత విషయంలో 100 శాతం కచ్చితంగా ఉండాలి. దేశానికి చైనా ఎంత నష్టం చేస్తోందో చూస్తూనే ఉన్నాం. అందుకే ఒప్పందాన్ని నేను చూడాలి. "
-- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
మరోవైపు ఈ సంస్థల లావాదేవీల ద్వారా అమెరికా ఖజానా భారీగా లబ్ధిపొందుతుందని ఆశించారు ట్రంప్. అయితే ఇందుకు సంబంధించిన నియమాలను ఆయన తప్పుబట్టారు.
"ప్రభుత్వానికి భారీగా నిధులు ఇవ్వడానికి వారు సిద్ధంగా ఉన్నారు. కానీ ఆ డబ్బులు తీసుకోవడానికి మాకు అనుమతి లేదు. అసలు ఇవేం నిబంధనలు? దీన్ని కచ్చితంగా పరిశీలిస్తాం. వెంటనే పరిశీలిస్తాం."
--- డొనాల్డ్ ట్రంప్. అమెరికా అధ్యక్షుడు
టిక్‌టాక్ వినియోగదారుల సమాచారం చైనాకు చేరుతుందంటూ, వారి సమాచార భద్రతపై గతంలో అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో యాప్ యూఎస్ కార్యకలాపాలను సెప్టెంబరు 15లోగా విక్రయించేలా ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. ఆ కొనుగోలుకు మైక్రోసాఫ్ట్ ఆసక్తి చూపినా.. బైట్‌డ్యాన్స్ అందుకు అంగీకరించలేదు. తాజాగా ఒప్పందం కుదుర్చుకునేందుకు ఒరాకిల్- బైట్డాన్స్లు చాలా దగ్గరగా ఉన్నట్టు ట్రంప్ ఇటీవలే వెల్లడించారు.
ఇదీ చూడండి:-'మోదీ బొమ్మ'కు కోటి వ్యూస్- ట్రంప్ అస్త్రం హిట్