అఫ్గాన్‌లో అమెరికా పోరాటం ముగిసింది. అమెరికా దళాలతో కూడిన చివరి విమానం.. మంగళవారం కాబుల్ విమానాశ్రయాన్ని వీడింది(us army in afghanistan). 9/11 దాడులకు ప్రతీకారం కోసం అఫ్గాన్‌లో అడుగుపెట్టిన అగ్రరాజ్యం(us afghan war).. నాటి తాలిబన్ పాలనకు ముగింపు పలికి.. దేశంలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పింది. కానీ అదే అమెరికా వీడే సమయానికి పరిస్థితులు మళ్లీ మొదటికొచ్చాయి! అఫ్గాన్ తాలిబన్ల వశమైంది.
ప్రస్తుతం అమెరికాలోని ప్రతి నలుగురిలో ఒకరు 9/11 దాడుల అనంతరం జన్మించినవారు ఉన్నారు. వాస్తవానికి అమెరికా పౌరులు.. అఫ్గాన్‌లో తమ దేశ కార్యకలాపాలను పట్టించుకున్నది రెండు సందర్భాల్లోనే. అవి కూడా.. ప్రారంభం, ముగింపులోనే. అమెరికా కాంగ్రెస్ కూడా వియత్నాం యుద్ధానికి ఇచ్చినంత ప్రాధాన్యం అఫ్గాన్ వ్యవహారాలకు ఇవ్వలేదు!
అమెరికా వెనుదిరిగినా.. అఫ్గాన్ వ్యవహారం ఆ దేశాన్ని ఇంకొంత కాలం పట్టిపీడిస్తుంది. ఎందుకంటే.. అక్కడి ఖర్చుల కోసం అగ్రరాజ్యం భారీగా అప్పులు చేసింది. రానున్న తరాల అమెరికా పౌరులు ఆ భారాన్ని మోయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ క్రమంలో అఫ్గాన్ సంక్షోభాన్ని(afghanistan news) అంకెల రూపంలో ఓసారి చూద్దాం..
మరణాలు (ఏప్రిల్ నాటికి)..
- అమెరికా సైనికులు- 2,461
- అమెరికా కాంట్రాక్టర్లు- 3,846
- నాటో సభ్యులు సహా మిత్ర దేశాల సైనికులు- 1,144
- అఫ్గాన్ పౌరులు- 47,245
- తాలిబన్లు, ఇతర ఫైటర్లు- 51,191
- జర్నలిస్టులు- 72
- సహాయకులు- 444
20ఏళ్లలో అఫ్గాన్ సాధించిన వృద్ధి..
- శిశు మరణాల రేటు 50శాతానికి పైగా తగ్గింది.
- చదవగలిగే అఫ్గాన్ బాలికల సంఖ్య 37శాతం పెరిగింది.
- 2005లో విద్యుత్ సౌకర్యం కలిగిన అఫ్గానీలు 22శాతంగా ఉండగా.. 2019లో అది 98శాతానికి చేరింది.