ప్రపంచంలోని వివిధ దేశాలు సోమవారం లాక్‌డౌన్ నిబంధనలను సడలించాయి. దీంతో జనసందోహం మొదలైంది. డెన్మార్క్‌లోని టాటూ పార్లర్లు, ఆస్ట్రేలియాలోని బీచ్‌లు, జర్మనీలోని పుస్తక దుకాణాలు తెరచుకుంటున్నాయి. ఆస్ట్రేలియాలో అతిపెద్ద ధారావాహిక ‘నైబర్స్’ చిత్రీకరణను పునఃప్రారంభించనున్నారు. జర్మనీ, స్వీడన్, స్లొవేకియాల్లో కార్ల ఉత్పత్తి మళ్లీ ప్రారంభం కానుంది. డెన్మార్క్‌లోనూ క్రమేపీ వ్యాపార కార్యకలాపాలు మొదలవుతున్నాయి. ఇరాన్‌లో జాతీయ రహదారుల్ని, వ్యాపార కేంద్రాలను తెరవడం ప్రారంభమయింది.
భిన్నాభిప్రాయాలు...
ఇటలీలో మరణాలు ఎక్కువగా కనిపించిన దృష్ట్యా లాక్‌డౌన్‌ను ఎత్తివేయాలా, కొనసాగించాలా అనే విషయమై భిన్నాభిప్రాయాలున్నాయి. ఆంక్షల్ని సడలించే అవకాశాలు లేవని బ్రిటన్ చెబుతోంది. అనేక ఇతర దేశాలూ సడలింపుల దిశగానే వెళ్తున్నా, కొత్త కేసులు పెరగకుండా సామాజిక దూరాన్ని తగినంత పాటించాలని భావిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 177 దేశాల్లో ఇప్పటి వరకు దాదాపు 24.53 లక్షల మంది కరోనా బారిన పడగా వారిలో 1.65 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఒక్క అమెరికాలోనే 41 వేల మందికి పైగా చనిపోయారు. ఇప్పటివరకు ఈ దేశంలో 7,71,000కు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.
అగ్రరాజ్యంలో రాజకీయం..
ఇళ్లకే పరిమితం కావాలన్న ఆంక్షల్ని వ్యతిరేకిస్తున్నవారికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాహాటంగానే మద్దతు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఉపాధిని కోల్పోతున్నామంటూ ప్రజల నుంచి వెల్లువెత్తుతున్న ప్రదర్శనల కారణంగా కొన్ని రాష్ట్రాలు, ప్రధానంగా రిపబ్లికన్ నేతల పాలనలో ఉన్నవి ఆంక్షల్ని సడలించే దిశగా వెళ్తున్నాయి. అంటువ్యాధుల నివారణ నిపుణుడు ఆంటోనీ ఫౌచికి తక్షణం ఉద్వాసన పలకాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. నిరసనలో భాగంగా వారెవరూ మాస్కులు ధరించడం లేదు, వ్యక్తిగత దూరం పాటించడం లేదు.
ఆంక్షల ఎత్తివేతలో తొందరపడితే మొదటికే మోసం వస్తుందని ఫౌచి హెచ్చరిస్తున్నారు. క్రమేపీ సాధారణ పరిస్థితులకు చేరుకోవడానికి అమెరికాలోని పలు ప్రాంతాలు సిద్ధంగా ఉన్నాయని ట్రంప్ చెబుతున్నారు. పరీక్షల సంఖ్యను పెంచాలని ఆయన రాష్ట్రాలను కోరారు. దానికి తాము సిద్ధమేనని, సరిపడా సంఖ్యలో కిట్లు లేనందున వాటిని ముందు సరఫరా చేయాలని రాష్ట్రాలు అడుగుతున్నాయి. వెంటనే ఆంక్షలను సడలించడం తొందరపాటే అవుతుందని, మరోసారి కరోనా విజృంభించే అవకాశం ఉందని రాష్ట్రాల గవర్నర్లు హెచ్చరిస్తున్నారు.