'లష్కరే, జైషే ఉగ్ర సంస్థల వల్ల భారత్కు ముప్పు' పాకిస్థాన్ ఆధారిత లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థల వల్ల భారత్కు ప్రమాదం పొంచి ఉందని అమెరికా హెచ్చరించింది. లష్కరే తోయిబాతో సంబంధాలున్న వారిని ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనుమతిచ్చిన పాక్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
'కంట్రీ రిపోర్ట్స్ ఆన్ టెర్రరిజమ్-2018' పేరిట ఇటీవలే ఓ నివేదికను విడుదల చేసింది అమెరికా. ఉగ్రవాదాన్ని నిర్మూలించటంలో ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఎటిఎఫ్) ప్రణాళికను అమలు చేయటంలో పాక్ అధికారులు విఫలమయ్యారని మండిపడింది. ఐరాస ఆంక్షలు విధించినప్పటికీ.. లష్కరే తోయిబా సహా ఇతర ఉగ్రవాద సంస్థలకు పాకిస్థాన్ నుంచి ఆర్థిక సహాయం అందుతూనే ఉందని స్పష్టం చేసింది.
భారత్ లక్ష్యంగా 2008 ముంబయి దాడులు, 2018 ఫిబ్రవరిలో కశ్మీర్ సుంజువాన్ ప్రాంతంలో ఉన్న సైనిక శిబిరాలపై దాడులకు కారణం పాక్కు చెందిన లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ సంస్థలేనని నివేదికలో పేర్కొంది అమెరికా.
ఆఫ్గానిస్థాన్ ప్రభుత్వానికి మద్దతు పలుకుతూనే ఉగ్రవాదులను పాకిస్థాన్ పెంచి పోషిస్తోందని నివేదికలో తెలిపింది. తీవ్రవాదుల ద్వారా అమెరికా- ఆఫ్గాన్ సైనికులను బెదిరించే ప్రయత్నం చేస్తోందని మండిపడింది. అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తూ ఉగ్రవాద ఆర్థిక కార్యకలపాలను నియంత్రించటంలో విఫలమై.. ప్రపంచ దేశాల విశ్వాసాన్ని పాకిస్థాన్ కోల్పోయిందని అభిప్రాయపడింది.
ఇదీ చూడండి:ఉద్యోగం వీడాడు.. ప్లాస్టిక్కు వ్యతిరేకంగా సైకిల్ పట్టాడు