అమెరికాయేతరులకు హెచ్-1బీ వీసాపై ఇటీవలి కాలంలో జరిపిన నియమకాలు సహా.. భవిష్యత్తు నియామకాలను సైతం అడ్డుకునేందుకు రిపబ్లికన్ పార్టీకి చెందిన చట్టసభ్యులు మో బ్రూక్స్, మాట్ గెట్జ్, లాన్స్ గూడెన్ల బృందం ఒక బిల్లును ప్రవేశపెట్టింది. జాబ్స్ ఫస్ట్ యాక్ట్ పేరిట ప్రవేశపెట్టిన ఈ బిల్లు ద్వారా.. వలస విధానం, అమెరికన్ జాతీయత చట్టంలో అవసరమైన మార్పులు చేయడం ద్వారా హెచ్-1బీ వీసా కార్యక్రమాన్ని సరిదిద్దాలని వీరు ప్రతిపాదించారు.
అమెరికా కంపెనీలు అమెరికన్లకు బదులుగా విదేశీ ఉద్యోగులను చేర్చుకోకుండా, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించటమే లక్ష్యంగా ఈ బిల్లును రూపొందించారు.
సాంకేతిక నైపుణ్యం కలిగిన విదేశీ వృత్తి నిపుణులను అమెరికన్ కంపెనీలు నియమించుకునేందుకు హెచ్-1బీ వీసాలు జారీ చేస్తుంది అగ్రరాజ్యం. భారత్, చైనాల నుంచి ఏటా వేల మంది ఉద్యోగులను ఆయా కంపెనీలు నియమించుకుంటున్నాయి.
అయితే అమెరికా ప్రతినిధుల సభలో డెమొక్రాట్లకు మెజారిటీ ఉన్నందున.. ఈ బిల్లు నెగ్గే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి.