చైనా నుంచి ఎదురవుతున్న సవాళ్లపై చతుర్భుజ కూటమి (క్వాడ్) దేశాల అగ్రనేతలు తమ తొలి భేటీలో చర్చించారని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలివన్ తెలిపారు. చైనా ఘర్షణాత్మక వైఖరిని వీడుతుందన్న భ్రమలు తామెవరికీ లేవని నాలుగు దేశాల నేతలు విస్పష్టం చేశారన్నారు. క్వాడ్ కూటమి అగ్రనేతల తొలి వర్చువల్ సమావేశం శుక్రవారం జరిగిన విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు బైడెన్, మూడు దేశాల ప్రధానులు నరేంద్ర మోదీ (భారత్), స్కాట్ మోరిసన్ (ఆస్ట్రేలియా), యోషిహిదే సుగా (జపాన్) పాల్గొన్న ఆ చరిత్రాత్మక భేటీ వివరాలను శ్వేత సౌధం వద్ద జరిగిన విలేకరుల సమావేశంలో జేక్ సలివన్ వెల్లడించారు. క్వాడ్ సమావేశం సభ్య దేశాల మధ్య పరస్పర సహకారం కోసమే జరగాలని, తృతీయ పక్ష దేశాన్ని లక్ష్యంగా చేసుకోవడం కారాదన్న చైనా అభ్యంతరాలను తోసిపుచ్చేలా జేక్ సలివన్ ప్రకటన ఉండటం గమనార్హం.
టీకాల ఉత్పత్తికి అమెరికా సాంకేతికత..
ప్రపంచ దేశాలను వెంటాడుతున్న కరోనా వైరస్ను తుదుముట్టించేందుకు క్వాడ్ అగ్రనేతలు కీలక నిర్ణయం తీసుకున్నారని జేక్ వెల్లడించారు. దీని ప్రకారం.. భారత్లో వచ్చే ఏడాది చివరికి 100 కోట్ల డోసుల టీకా తయారీకి అవసరమైన సాంకేతికతను అమెరికా అందిస్తుంది. దాంతో పాటు అమెరికా, జపాన్లు ఆర్థిక సాయం చేస్తాయి. టీకాల సరఫరా, రవాణా బాధ్యతను ఆస్ట్రేలియా చేపడుతుందని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు వివరించారు. చైనా టీకా దౌత్యాన్ని అడ్డుకోవడం దీని ప్రధాన లక్ష్యం.