తాజాగా భారత్- చైనా సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తతలపై భారత్కు బాసటగా నిలిచింది అమెరికా మీడియా. సరిహద్దులో ఉద్రిక్తతలను పెంచుతూ భారత జాతీయవాదాన్ని చైనా రెచ్చగొడుతోందని అభిప్రాయపడింది. వాస్తవాధీన రేఖ వెంట ఇంతకుముందు నెలకొన్న శాంతియుత పరిస్థితులను చెదరగొట్టేలా చైనా బలగాలు ఏకపక్షంగా వ్యవహరించాయని వాషింగ్టన్ ఎగ్జామినర్ పత్రిక తన సంపాదకీయంలో ప్రచురించింది. సైనిక ఉపసంహరణపై అవగాహనకు వచ్చి ఆ ప్రక్రియ కొనసాగుతుండగానే.. భారత సైనికులతో చైనా జవాన్లు బాహాబాహీకి దిగడం సరికాదని పేర్కొంది.
"సోమవారం సాయంత్రం జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లను చంపి చైనా సైన్యం.. భారత జాతీయవాద పులిని రెచ్చగొడుతోంది."
-టామ్ రోగన్, కాలమిస్ట్, వాషింగ్టన్ ఎగ్జామినర్
జాతీయవాదమే ఆధారంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాలనా యంత్రాంగాన్ని నడిపిస్తున్నట్లు తన వ్యాసంలో నొక్కి చెప్పారు రోగన్. అంతర్గతంగా నెలకొన్న సమస్యల నుంచి జాతీయవాదం, అంతర్జాతీయంగా ప్రముఖ స్థానం వైపు భారత ప్రజానీకం చూసేలా దృష్టి మరల్చారని పేర్కొన్నారు. సోమవారం నాటి ఘర్షణ.. మరో సరికొత్త సవాలును మోదీ ముందు నిలిపిందని అభిప్రాయపడ్డారు.
"2019లో పుల్వామాలో జరిగిన దాడి తర్వాత అత్యంత వేగంగా చర్యలు తీసుకున్నారు భారత ప్రధాని. ఈ నేపథ్యంలో ఆయనపై ఉన్న అంచనాల మేరకు మోదీ ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. భారత ప్రయోజనాలకు వ్యతిరేకంగా చైనా వ్యవహరించడం ఇటీవలి కాలంలో ఇదే ప్రథమం కాదు."