కరోనా వ్యాక్సిన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెబుతున్న మాటల్ని తాను ఏమాత్రం విశ్వసించడం లేదని డెమోక్రాటిక్ పార్టీ తరఫున ఉపాధ్యక్ష బరిలో ఉన్న కమలా హారిస్ అన్నారు. ట్రంప్ చెబుతున్నట్లుగా ఒకవేళ అధ్యక్ష ఎన్నికల నాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా.. దాని సామర్థ్యం, భద్రతపై తనకు ఏమాత్రం నమ్మకం లేదన్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం వ్యాక్సిన్ తయారీ ప్రక్రియను వేగవంతం చేయాలని దాన్ని అభివృద్ధి చేస్తున్న సంస్థలపై ట్రంప్ ఒత్తిడి తీసుకొస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా కమలా హారిస్ ఆయనపై విమర్శలు చేశారు.
అందుకే టీకాస్త్ర ప్రయోగం..
తాజా అధ్యక్ష ఎన్నికల్లో మహమ్మారి వ్యాప్తి కట్టడి కీలక ప్రచారాస్త్రంగా మారింది. ట్రంప్ కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడంలో ఘోరంగా విఫలమయ్యారని డెమోక్రాట్లు ఆరోపిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధిక కేసులు, మరణాలు ఇప్పటి వరకు అగ్రరాజ్యంలోనే నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ విమర్శల నుంచి బయటపడడానికి ట్రంప్ ప్రత్యర్థులపై టీకా అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. త్వరలోనే టీకా రాబోతోందంటూ.. అందుకు సంస్థలకు కావాల్సిన సహకారాన్ని ప్రభుత్వం నుంచి అందిస్తున్నామంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ట్రంప్ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం వ్యాక్సిన్ తయారీ సంస్థలపై ఒత్తిడి పెంచుతున్నారని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు.