అమెరికా ఉపాధ్యక్షురాలిగా చరిత్ర సృష్టించారు కమలా హారిస్. 20న బాధ్యతలు స్వీకరించనున్నారు. సగటు భారతీయ మహిళలానే వంట చేయడాన్ని అమితంగా ఇష్టపడే ఆమె మంచి రాజకీయ నాయకురాలిగానే కాదు...చేయి తిరిగిన పాకశాస్త్ర నిపుణురాలిగానూ మన్ననల్ని అందుకుంటున్నారు. మరి ఆమె వంటగది ముచ్చట్లు... ఇష్టాయిష్టాలు తెలుసుకుందామా..
నాకెంతో ఇష్టం... ఇలా చేయాలి...
"దీనిపేరు హోల్‌రోస్టెడ్ చికెన్.ముందు రోజే హోల్ చికెన్‌కు నిమ్మరసం, హెర్బ్స్, సన్నగా తరిగిన వెల్లుల్లి, మిరియాల పొడి, ఉప్పు పట్టించాలి. ఆపై వెన్న రాయాలి. గట్టిగా దారంతో కట్టి ఓ రోజంతా ఫ్రిజ్‌లో పెట్టాలి. మరుసటి రోజు దాన్ని సన్నని మంటమీద కాల్చి మంచి సాస్‌తో తింటే ఆ రుచే వేరు" అంటారు కమల.
వారికోసం...
కార్న్‌బ్రెడ్ డ్రెస్సింగ్ థ్యాంక్స్ గివింగ్ డే రోజు అమెరికన్‌లు స్నేహితులు, పొరుగువారితో కలిసి భోజనం చేస్తారు. ఈ పండగను ఎప్పుడు చేసుకున్నా...కమల కార్న్‌బ్రెడ్ డ్రెస్సింగ్ తప్పకుండా చేయాల్సిందే. మొన్న నవంబర్‌లో జరిగిన ఈ ప్రత్యేకమైన రోజున "మా కుటుంబానికి ఇష్టమైన రెసిపీని ఇప్పుడు మీతో పంచుకుంటున్నా" అంటూ ఇన్‌స్టాలో పోస్ట్‌చేశారు.
ఇడ్లీ.. సాంబారు!
హోల్ రోస్టెడ్ చికెన్ చేసిన కమలా హారిస్ బంధువులు, స్నేహితుల్ని విందుకు పిలిచి వండి వడ్డించడం నాకెంతో ఇష్టం అంటారు కమల. ఆమె కూడా దక్షిణాది రుచులైన ఇడ్లీ-సాంబారులను చాలా ఇష్టంగా తింటారు. పాశ్చాత్య వంటకాల్లో హోల్ రోస్టెడ్ చికెన్, ట్యూనా మెల్ట్, బుర్రిటోస్, చీజ్ బర్గర్లను ఇష్టపడతారు ఉదయం అల్పాహారంగా బాదంపాలలో నానబెట్టిన రైసిన్ బ్రాన్, నిమ్మకాయ, తేనె కలిపిన టీ తీసుకుంటారు.
మసాలా దోశతో...
ఎన్నికల్లో అభ్యర్థిత్వంకోసం ప్రయత్నిస్తున్న సమయంలో కమల భారత సంతతి కమెడియన్ మిండీ కలింగ్‌తో కలిసి వేసిన మసాలా దోశ వీడియో తెగ వైరల్ అయ్యింది. తమ భారతీయ మూలాలు గురించి చెప్పుకుంటూ...చిన్నప్పుడు అన్నం, పెరుగు, బంగాళాదుంప కూర, పప్పు, ఇడ్లీ వంటివి ఇష్టంగా తినేదాన్నని చెప్పారు కమల. అమ్మమ్మ శాకాహారి కావడంతో ఆమె ఎటైనా వెళ్లినప్పుడు తాతయ్యతో కలిసి గుడ్లతో ఫ్రెంచ్ టోస్ట్ చేసుకునేదాన్నని చెబుతారామె.
సులువుగా చేయాలంటే...
అన్ని పనులకు ప్రణాళిక ఉన్నట్లే...వంటకీ ఉండాలి. ముందే అందుకు అవసరమైన పనులన్నీ పూర్తవ్వాలి. నేను గంటలు గంటలు జూమ్‌కాల్స్, సమావేశాలతో బిజీగా గడుపుతా. అందుకే ముందు రోజే అందుకు తగ్గట్లు సిద్ధమవుతా.
ఒత్తిడి... వంటిల్లు!
మనసు బాగోలేనప్పుడు, ఒత్తిడిగా ఉన్నప్పుడు రకరకాల వంటకాల ప్రయోగాలు చేస్తారట కమల. అందుకు తగ్గట్లే అవసరమైన దినుసులను గాజు సీసాల్లో అందంగా అమర్చుకున్నారు. ముఖ్యంగా భారతీయ వంటకాల్లో వాడే మసాలాలు ఆమె ప్రత్యేకంగా భద్రపరుచుకుంటారు. పప్పు ధాన్యాలు, బీన్స్ వంటి వాటికి ప్రాధాన్యం ఇస్తారు.
అమ్మ చెప్పిందని...
కమల అమ్మ, అమ్మమ్మ ఇద్దరూ వంటల్లో చేయి తిరిగినవారు. తల్లి శ్యామల క్యాన్సర్ పరిశోధకురాలుగా, హక్కుల కార్యకర్తగా ఎంత తీరికలేకుండా ఉన్నా... వారాంతంలో ఉదయాన్నే నిద్రలేచి వంట చేసేవారట. కమల ఆహార ప్రియురాలు. అది గమనించిన వాళ్లమ్మ ఓ రోజు ‘కమలా నీకిష్టమైనవి తినాలనుకుంటే...ముందు వాటిని ఎలా వండాలో నేర్చుకో’ అన్నారట. "అది మొదలు... వంటిల్లు నాకెంతో ఇష్టమైన స్థలమైంది. ఘుమఘుమల్ని ఆస్వాదించడం మొదలుపెట్టా" అంటారు కమల.
ప్రతి మహిళా ఓ విషయం గమనించాలి. పనిని సమన్వయం చేసుకోవాలంటే... పని విభజన జరగాలి. ఆ క్రమంలో నా భర్తకు వంటింటి బాధ్యతలు అప్పజెప్పిన సందర్భాలు ఎన్నో...
- కమలా హారిస్, అమెరికా తదుపరి ఉపాధ్యక్షురాలు