అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ట్రంప్ శిబిరం ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. రాజకీయంగా, ఆర్థికంగా, జనాభా పరంగా కీలకంగా మారిన భారతీయ అమెరికన్లను ఆకట్టుకునేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు ట్రంప్ రెండో కుమారుడు ఎరిక్ ట్రంప్ తన తండ్రి తరపున ఎన్నికల ప్రచారంలో చురుగ్గా వ్యవహరిస్తున్నారు.
అట్లాంటాలో ఇటీవల జరిగిన ఓ సమావేశంలో ఆయన భారతీయులను ఉద్దేశించి మాట్లాడుతూ.. డెమోక్రటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ తీరును విమర్శించారు. ఆమె స్వయంగా భారతీయ సంతతికి చెందినవారైనప్పటికీ భారతీయ అమెరికన్లను దూరంగా ఉంచారని ఆయన ఆరోపించారు. భారతీయ వారసత్వాన్ని గురించి ఘనంగా చెప్పుకోవటమే తప్ప ఆమె చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. హారిస్ చెప్పే మాటలకు, ఆమె చేసే పనులకు ఎలాంటి సంబంధం లేదని విమర్శించారు. భారతీయ అమెరికన్లు ఎప్పుడూ అత్యుత్తమమైన వారినే ఎన్నుకుంటారని..తన తండ్రి ట్రంప్ కూడా వారినెప్పుడూ నిరాశ పరచలేదని ఆయన అన్నారు. ఎంతో గొప్ప వారసత్వమున్న భారతీయులను తమ కుటుంబమంతా అమితంగా ప్రేమిస్తుందని ఎరిక్ వివరించారు. భారత్ ఓ అద్భుతమైన ప్రజలున్న గొప్ప దేశమని ఆయన ప్రశంసించారు.