కొవిడ్-19 మెదడుపై కూడా ప్రభావం చూపుతుందా.. అంటే అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. తీవ్ర కరోనాతో చనిపోయిన వారిలో పార్కిన్సన్స్, అల్జీమర్స్ మృతుల్లో కనిపించే రీతిలో మెదడులో వాపు ప్రక్రియ (ఇన్‌ఫ్లమేషన్), నాడీ క్షీణత కనిపించిందని అమెరికాకు చెందిన స్టాన్‌ఫోర్డ్ స్కూల్ ఆఫ్ మెడిసన్, జర్మనీకి చెందిన సార్లాండ్ యూనివర్సిటీ అధ్యయనంలో తేలింది.
దీర్ఘకాలంగా కొవిడ్ సమస్యలతో బాధపడుతున్న వారిలో ఈ వాపు ప్రక్రియ ప్రభావం తీవ్రంగా ఉందని వీరి పరిశోధనలో తేలింది. కొవిడ్-19తో ఆసుపత్రి పాలైన వారిలో మూడింట ఒక వంతు మందిలో అస్తవ్యస్త ఆలోచనలు, మతిమరుపు, ఏకాగ్రత లోపం, కుంగుబాటు కనిపించాయని స్టాన్‌ఫోర్ట్ ప్రొఫెసర్ టోనీ కోరే తెలిపారు.