తెలంగాణ

telangana

ETV Bharat / international

ఒక్క డోసులో కరోనా టీకా.. ఆశాజనకంగా ఫలితాలు - us corona vaccine news

కరోనా టీకాను అభివృద్ధి చేస్తున్న అమెరికాకు చెందిన జాన్సన్‌ అండ్ జాన్సన్‌ సంస్థ మరో ముందడుగేసింది. ఒక్క డోసు వ్యాక్సిన్​ సానుకూల ఫలితాలు ఇస్తున్నట్లు తెలిపింది. ఇప్పటికే ప్రభుత్వ అనుమతితో 1000 మంది వలంటీర్లపై ఈ వ్యాక్సిన్‌ను ప్రయోగించగా.. బుధవారం మానవులపై తుది దశ ప్రయోగ పరీక్షలు ప్రారంభించింది. అమెరికా, దక్షిణాఫ్రికా, అర్జెంటీనా, బ్రెజిల్‌, చిలీ, కొలంబియా, మెక్సికో, పెరూల్లో మొత్తం 60 వేల మంది వలంటీర్ల పై ఈ వ్యాక్సిన్‌ ప్రయోగిస్తున్నారు.

Johnson-and-Johnson-Vaccine-Produces-Strong-Immune-Response
ఒక్క డోసులో టీకా..ఆశాజనకంగా ఫలితాలు

By

Published : Sep 26, 2020, 11:50 AM IST

ఒకే ఒక్క డోసుతో కొవిడ్‌-19 నుంచి రక్షణ కల్పించగల సామర్థ్యమున్న టీకాను అభివృద్ధి చేస్తున్న అమెరికాకు చెందిన జాన్సన్‌ అండ్ జాన్సన్‌ సంస్థ మరో ముందడుగేసింది. ఇప్పటికే ప్రభుత్వ అనుమతితో 1000 మంది వాలంటీర్లపై ఈ వ్యాక్సిన్‌ను ప్రయోగించగా ఉత్తమ ఫలితాలు వచ్చాయి. దీంతో బుధవారం మానవులపై తుది దశ ప్రయోగపరీక్షలు ప్రారంభం కాగా.. అందులోనూ ఫలితాలు ఆశాజనకంగా వస్తున్నట్లు సంస్థ మధ్యంతర ఫలితాలను విడుదల చేసింది. ఈ ప్రయోగాల్లో భాగంగా అమెరికా, దక్షిణాఫ్రికా, అర్జెంటీనా, బ్రెజిల్‌, చిలీ, కొలంబియా, మెక్సికో, పెరూల్లో మొత్తం 60 వేల మంది వలంటీర్ల పై ఈ వ్యాక్సిన్‌ ప్రయోగిస్తున్నారు. అయితే 65 ఏళ్లకు పైబడిన 15 మందికి మాత్రమే ఈ వ్యాక్సిన్‌ ఇస్తున్నారు. వలంటీర్లలో వ్యాధి నిరోధక స్థాయిలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని సంస్థ వెల్లడించింది.

చివరి దశ ప్రయోగాలు విజయవంతమైతే ఈ ఏడాది చివరిలోగానీ, వచ్చే ఏడాది ప్రారంభంలో వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ వెల్లడించింది. మొదటి ప్రయోగదశలో భాగంగా గత జులైలో తొలుత కోతులపై ఈ వ్యాక్సిన్‌ను ప్రయోగించారు. అయితే కరోనా వైరస్‌ ముప్పు అధికంగా ఉన్న వయస్సు మళ్లినవారిపై ఈ టీకా ప్రభావం చూపిస్తుందా?అన్ని రకాల వయస్సుల వారికి ఒకే డోస్‌ ఇవ్వడం వల్ల వ్యతిరేక ప్రభావాలేమైనా కనిపిస్తాయా? అనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. దీనిపై పూర్తి వివరాలు తెలియాలంటే చివరిదశ ప్రయోగ ఫలితాలు వచ్చేంత వరకు వేచిచూడాల్సిందేనని హార్వర్డ్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ డా.బ్యారీ బ్లూమ్‌ మీడియాకు తెలిపారు. సాధారణంగా ఏదైనా టీకా మంచి ఫలితాలనివ్వాలంటే కనీసం రెండు డోసులను తీసుకోవాల్సి ఉంటుందని.. అందుకు భిన్నంగా ఒకే ఒక్క డోసుతో కరోనా నుంచి రక్షణ కల్పించేలా తమ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశామని జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ ప్రధాన శాస్త్రీయ అధికారి డాక్టర్‌ పాల్‌ స్టోఫెల్స్‌ గతంలో చెప్పిన విషయం తెలిసిందే.

ABOUT THE AUTHOR

...view details