తెలంగాణ

telangana

ETV Bharat / international

త్వరలోనే సింగిల్‌ డోసు టీకా ఫలితాలు!

జాన్సన్ అండ్ జాన్సన్ అభివృద్ధి చేసిన సింగిల్ డోసు టీకా ప్రయోగ ఫలితాలు త్వరలో విడుదల కానున్నాయి. ఒకే డోసు కావడం, సాధారణ రిఫ్రిజిరేటర్‌ ఉష్ణోగ్రతల వద్దే దీన్ని నిల్వ ఉంచుకునే అవకాశాలు ఉన్నందున ఈ ఫలితాలపై ఆసక్తి నెలకొంది.

Johnson & Johnson COVID-19 Vaccine Results "Next Week": Top Official
త్వరలోనే సింగిల్‌ డోసు టీకా ఫలితాలు!

By

Published : Jan 28, 2021, 5:10 AM IST

ప్రముఖ ఔషధ సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ ప్రయోగ ఫలితాలు వారంలోనే వెల్లడయ్యే అవకాశాలున్నాయని సంస్థ వెల్లడించింది. తద్వారా ఇప్పటికే కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం, వ్యాక్సిన్‌ సరఫరా వేగవంతం చేస్తామని తెలిపింది. ఈ టీకాను సింగిల్ డోసు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుందని జాన్సన్‌ అండ్ జాన్సన్‌ పేర్కొనడంతో వీటి ప్రయోగ ఫలితాలపై ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

కరోనా వైరస్‌ మహమ్మారిని ఎదుర్కొనే వ్యాక్సిన్‌ ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 57 దేశాల్లో అందుబాటులోకి వచ్చింది. వీటిలో ఫైజర్‌, ఆస్ట్రాజెనెకా, మోడెర్నా, కొవాగ్జిన్‌తో పాటు రష్యా, చైనా దేశాల్లోనూ మరికొన్ని టీకాలు అత్యవసర వినియోగం కింద అనుమతి పొందాయి. ఇప్పటి వరకు అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్‌లన్నీ తప్పనిసరిగా రెండు డోసుల్లో తీసుకోవాల్సి ఉంటుంది. జాన్సన్‌ అండ్ జాన్సన్‌ సంస్థ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ ఒకే డోసు సరిపోతుందని ప్రకటించింది. అంతేకాకుండా సాధారణ రిఫ్రిజిరేటర్‌ ఉష్ణోగ్రతల వద్దే దీన్ని నిల్వ ఉంచుకునే అవకాశం ఉంది. వీటికి సంబంధించిన ప్రయోగ ఫలితాలను వారంలోనే వెల్లడయ్యే అవకాశాలు ఉన్నట్లు సంస్థ వెల్లడించింది. యూరోపియన్‌ యూనియన్‌, అమెరికా, బ్రిటన్‌, కెనడా వంటి దేశాలు జాన్సన్‌ అండ్ జాన్సన్‌తో వ్యాక్సిన్‌ కోసం ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇక ఈ సింగిల్‌ డోసు వ్యాక్సిన్‌ కాకుండా, రెండు డోసుల్లో తీసుకునే మరో వ్యాక్సిన్‌ ప్రయోగాలను కూడా జాన్సన్‌ అండ్ జాన్సన్‌ నవంబర్‌లో ప్రారంభించింది.

7 కోట్ల మందికి టీకా..

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 57 దేశాల్లో వ్యాక్సిన్‌ పంపిణీ ప్రారంభం కాగా, దాదాపు 7 కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. అమెరికాలో అత్యధికంగా రెండున్నర కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు సీడీసీ వెల్లడించింది. భారత్‌లోనూ వ్యాక్సిన్ తీసుకున్న వారిసంఖ్య 20 లక్షలు దాటింది.

ABOUT THE AUTHOR

...view details