తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనా గుట్టు తేల్చే కొత్త నమూనా కోసం పరిశోధన

కరోనా వ్యాప్తి తీరుతెన్నులను పరిశీలించేందుకు జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం కీలక పరిశోధన చేపట్టనుంది. అత్యంత వేగంగా కొవిడ్​ వ్యాప్తి చెందడానికి గల కచ్చితమైన కారణాలు తెలుసుకోవడం సహా వైరస్​ సంక్రమణ గురించి పూర్తి అవగాహన కోసం స్క్రిప్స్ రీసెర్చ్, యూసీఎల్ఏ సంస్థలతో కలిసి సంయుక్తంగా అధ్యయనం చేపట్టనుంది.

By

Published : Jun 15, 2020, 2:34 PM IST

Johns Hopkins varsity joins
కరోనాను విశ్లేషించే నూతన నమూనా కోసం పరిశోధన

ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనాను ఎదుర్కోవడంలో భాగంగా పరిశోధనా సంస్థలన్నీ వైరస్​పై విస్తృత అధ్యయనాలు చేస్తున్నాయి. ఈ కోవలోనే అమెరికాకు చెందిన జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం కరోనా వ్యాప్తి తీరుతెన్నులపై పరిశోధన నిర్వహించడానికి రంగం సిద్ధం చేసింది. ప్రస్తుత పరిస్థితులతో పాటు భవిష్యత్తులో వైరస్ సంక్రమణ గురించి పూర్తి అవగాహన ఏర్పరచుకోవడం కోసం నూతన విధానాలు అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తోంది.

మరో రెండు సంస్థలతో కలిసి

ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన కొవిడ్-19 ట్రాకింగ్ రూపకర్త డా.లారెన్... గార్డ్​నర్ విశ్వవిద్యాలయం తరఫున పరిశోధనలో పాల్గొననున్నారు. స్క్రిప్స్ రీసెర్చ్, యూసీఎల్ఏ​ శాస్త్రవేత్తలతో కలిసి కొవిడ్ వ్యాప్తికి గల కచ్చితమైన కారణాలు తెలుసుకొనేందుకు నూతన పద్ధతులు రూపొందించనున్నారు.

"అంటువ్యాధులు ఎలా వ్యాప్తి చెందుతాయని తెలుసుకోవడం సహా.. ప్రజలపై ఈ వ్యాధులు భిన్న ప్రభావం చూపడానికి గల కారణాలను తెలుసుకోవడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా కొవిడ్-19 సంక్రమణం సహా వ్యాప్తి ముప్పును విశ్లేషించే కొత్త నమూనాలను అభివృద్ధి చేస్తాం."

-డా.లారెన్ గార్డ్​నర్, జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్

ప్రాజెక్టులో భాగంగా ప్రపంచవ్యాప్త వాతావరణ పరిస్థితులు, అంతర్జాతీయ విమాన ప్రయాణాలు, కొవిడ్ రోగుల జన్యు సమాచారంతో కూడిన భారీ డేటాబేస్​ను ఏర్పాటు చేయనున్నారు. ఈ సమాచారం విశ్లేషించి కరోనా వేగంగా వ్యాప్తి చెందడానికి గల కారణాలను వివరించే గణాంక నమూనాలను అభివృద్ధి చేయనున్నారు.

భారీ నిధులు

ఈ ప్రాజెక్టు కోసం జాతీయ వైద్య సంస్థ నుంచి 13 లక్షల డాలర్ల గ్రాంటు లభించింది. స్క్రిప్స్ రీసెర్చికి చెందిన క్రిస్టియన్ అండర్సన్ ఈ ప్రాజెక్టుకు అధ్యక్షత వహించనున్నారు.

"ప్రస్తుతం ఉన్న విధానాలు ఇన్ఫెక్షన్ వ్యాప్తికి గల కారణాలను పూర్తిగా విశదీకరించడం లేదు. వ్యాధికి కారణమయ్యే అన్ని కారకాలను ఈ విధానాలు అనుసంధానం చేయలేకపోతున్నాయి."

-ప్రొఫెసర్ క్రిస్టియన్ అండర్సన్, స్క్రిప్స్ రీసెర్చ్

'వివిధ ప్రభుత్వాలు చేపడుతున్న ప్రజారోగ్య చర్యలు పనిచేస్తున్నాయో లేదో తెలుసుకోవడం సహా వివిధ పరిస్థితుల్లో వ్యాధి వ్యాప్తి చెందుతున్న తీరును అర్థం చేసుకోవడానికి ఈ పరిశోధన ఉపయోగపడుతుంది' అని యూసీఎల్​ఏ బయోస్టాటిస్టిక్స్​ ఆచార్యులు మార్క్ సుచార్డ్ పేర్కొన్నారు.

ఇదీ చదవండి:డొనాల్డ్​ ట్రంప్ పేరుతో ఇజ్రాయెల్​లో ఓ గ్రామం

ABOUT THE AUTHOR

...view details