2020లో జరగబోయే అమెరికా అధ్యక్ష రేసులోకి జో బిడెన్ వచ్చారు. డెమొక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష ఎన్నికల్లో నిలబడనున్నట్లు ప్రకటించారు. బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన కాలంలో ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు బిడెన్. ఈ అనుభవమంతా తనకు భవిష్యత్తులో ఉపయోగపడుతందని భావిస్తున్నారు.
అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి సిద్ధమైనట్లు ట్విట్టర్లో వీడియో సందేశం ద్వారా తెలిపారు బిడెన్. 3 నిమిషాల 29 సెకెన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో అమెరికా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేశారు బిడెన్.
" అమెరికా ఏర్పాటు చేసుకున్న ప్రధాన విలువలు, ప్రపంచంలో దేశ స్థానం, ప్రజాస్వామ్యం ఇలా అన్నీ ప్రమాదంలో ఉన్నాయి. అందుకే 2020 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ఈరోజు నేను ప్రకటిస్తున్నాను."
- జో బిడెన్, అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు
వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిపై పోరాడేందుకు దాదాపు 20 మంది దాకా డెమొక్రాట్లు సిద్ధమవుతున్నారు. పార్టీలో అందరికంటే ఎక్కువ రాజకీయ అనుభవమున్న బిడెన్ ప్రకటనతో డెమొక్రాట్ల అభ్యర్థి ఎంపికకు అనధికారికంగా ముగింపు పడిందని అందరూ భావిస్తున్నారు. అయితే అధ్యక్ష రేసులోకి మరికొంత మంది వచ్చే అవకాశాలూ లేకపోలేదు.
దాదాపు 47 ఏళ్ల రాజకీయ అనుభవమున్న బిడెన్ 1988, 2008 సంవత్సరాల్లో డెమొక్రటిక్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష రేసులో నిలబడేందుకు ప్రయత్నించారు. అయితే రెండుసార్లు ఆయన అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేకపోయారు. మరి 2020లో అయినా ఆయన కల నెరవేరుతుందో లేదో వేచి చూడాలి.
బిడెన్ గురించి కొన్ని విషయాలు