తెలంగాణ

telangana

ETV Bharat / international

'బైడెన్​ అనే నేను.. అమెరికన్లను ఒక్కటి చేస్తాను' - బైడెన్​ డెమొక్రటిక్​ పార్టీ సభ

అమెరికా ప్రజలు తమ భవిష్యత్తు కోసం ఓటేశారని.. వారి విశ్వాసాన్ని నిలబెడుతూ, దేశ ప్రతిష్ఠను మరింత ఇనుమడింపజేసేందుకు కృషి చేస్తామని అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ హామీ ఇచ్చారు. అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్‌ గెలిచిన తర్వాత డెలావర్‌లోని విల్మింగ్టన్‌లో డెమొక్రాట్లు‌ తొలి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన బైడెన్‌.. అధ్యక్ష ఎన్నికల్లో సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. దేశాన్ని ఐక్యం చేసి అభివృద్ధి పథంలో ముందుకు నడిపేందుకు శాయశక్తులా కృషి చేస్తానని చెప్పారు.

Joe Biden pledges to unite America; calls for an end to 'grim era of demonisation'
'బైడెన్​ అనే నేను.. అమెరికన్లను ఒక్కటి చేస్తాను'

By

Published : Nov 8, 2020, 3:04 PM IST

Updated : Nov 8, 2020, 3:13 PM IST

అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ల విజయాన్ని అమెరికన్ల గెలుపుగా జో బైడెన్‌ అభివర్ణించారు. అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత డెలావర్​లోని విల్మింగ్టన్​లో ఏర్పాటు చేసిన డెమొక్రాట్ల సభలో తొలిసారి ప్రసంగించారు. ఉపాధ్యక్ష పదవికి ఎన్నికైన కమలా హారిస్‌ అద్భుతమైన నాయకురాలని కొనియాడారు. దేశ ప్రజలు ఆశిస్తున్న పాలన అందించేందుకు కమల సహకరిస్తారని బైడెన్‌ వెల్లడించారు. దేశాభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తామని బైడెన్‌ భరోసానిచ్చారు. దేశాభివృద్ధి కోసం రిపబ్లికన్లతో కలిసి సాగుతామని స్పష్టంచేశారు. ప్రజలు ఇచ్చిన తీర్పు.. దేశాభివృద్ధి కోసమేనని బలంగా విశ్వసిస్తున్నామని... అంతా కలిసి సాగితే అమెరికన్లు ఏదైనా సాధించగలరని వ్యాఖ్యానించారు.

విజయానందంలో జో-కమల

అమెరికా ఆత్మను మనం పునరుద్ధరించాలి. దేవదూతలు, చీకటి శక్తుల మధ్య నిరంతర యుద్ధాలతో మన దేశం రూపుదిద్దుకుంది. అధ్యక్షులు ఏం చెబుతారో అన్నది ఈ యుద్ధాల్లో ముఖ్యం. దేవదూతలు విజయం సాధించే సమయం ఇది. ప్రపంచమంతా అమెరికా వైపు చూస్తోంది. అమెరికా ఈ ప్రపంచానికి దారిచూపుతుందని నేను విశ్వసిస్తున్నాను.

---జో బైడెన్‌, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజేత

కరోనా విపత్కాలంలోనూ ఎన్నికలు సజావుగా సాగేందుకు సహకరించిన వలంటీర్లు, అధికారులకు బైడెన్‌ ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. కరోనా నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కరోనా కట్టడి కోసం ఒక ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేస్తామని తెలిపారు. కరోనా వైరస్‌ నియంత్రణలోకి వచ్చే వరకు ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించలేమని తెలిపిన జో.. కరోనా వల్ల జీవితంలో అత్యంత విలువైన క్షణాల్ని ఆస్వాదించలేమని వ్యాఖ్యానించారు. ఎన్నికల హామీ మేరకు.. అమెరికాలోని ప్రతి కుటుంబం ఆరోగ్య పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని బైడెన్ చెప్పారు. దేశంలోని అన్ని వర్గాల ప్రయోజనాల కోసం కృషి చేస్తామన్నారు.

'బైడెన్​ అనే నేను.. అమెరికన్లను ఒక్కటి చేస్తాను'
కమలా-బైడెన్​ 'విక్టరీ'

ఇదీ చూడండి:-బైడెన్ ప్రభుత్వ ఏర్పాటు సాఫీగా సాగేనా

దేశాన్ని విభజించడం కాకుండా ఐకమత్యంగా కలుపుతానని నేను అధ్యక్షుడిగా ప్రమాణం చేస్తున్నాను. రెడ్‌ స్టేట్స్‌, బ్లూ స్టేట్స్‌ కాకుండా యునైటెడ్‌ స్టేట్స్‌నే మేము చూస్తాం. అధ్యక్ష ఎన్నికల్లో నాకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు. నైతిక విలువలు, న్యాయం వైపు అమెరికా మరోసారి మళ్లింది.

---జో బైడెన్‌, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజేత

'ట్రంప్​ శత్రువు కాదు..'

ఎన్నికల్లో ఓడిన ట్రంప్‌ తనకు శత్రువేమీ కాదని బైడెన్‌ స్పష్టం చేశారు. అమెరికా అభివృద్ధి కోసం కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు.

అధ్యక్షుడు ట్రంప్‌నకు ఓటేసిన వారందరి నిరాశను నేను అర్థం చేసుకోగలను. నేను కూడా రెండు సార్లు ఓడిపోయాను. కానీ, ఇప్పుడు ఒకరికొకరు అవకాశం ఇచ్చుకుందాం. వాగ్వాదాలకు, ఉద్రిక్తతలకు దూరంగా ఉందాం. ఒకరి మాటను ఒకరు విందాం. అభివృద్ధి వైపు కలిసి సాగుదాం. శత్రువులుగా పరిగణించడం మానేద్దాం. వారు మన శత్రువులు కారు. వారు కూడా అమెరికన్లే.

---జో బైడెన్‌, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజేత

డెమొక్రాట్ల సందడి...

అధ్యక్ష స్థానం వరకు చేరుకునేందుకు తన జీవితంలో సహకరించిన జీవిత భాగస్వామి జిల్‌ బైడెన్‌ సహా ఇతర కుటుంబ సభ్యులను ఈ సందర్భంగా బైడెన్‌ ప్రశంసించారు. ప్రసంగం పూర్తైన తర్వాత అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల్లో విజేతలు తమ కుటుంబ సభ్యులతో వేదికపై సందడి చేశారు.

ర్యాలీకి పెద్ద సంఖ్యలో హాజరైన డెమొక్రాట్ల మద్దతుదారులు, టపాసులు పేలుస్తూ, కార్ల హారన్లు మోగిస్తూ సందడి చేశారు.

డెమొక్రాట్ల సంబరాలు

పెన్సిల్వేనియా, నెవాడాలో వచ్చిన ఫలితంతో అధ్యక్ష ఎన్నికల్లో మ్యాజిక్‌ మార్క్‌ దాటిన 77ఏళ్ల జో బైడెన్‌ 290 ఎలక్టోరల్ ఓట్లతో అమెరికా తదుపరి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. రిపబ్లికన్ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ 214 ఎలక్టోరల్ ఓట్ల దగ్గరే నిలిచిపోయారు.

ఇదీ చూడండి:-ఓటమికి ముందు ట్రంప్‌ ఏం చేశారంటే...

Last Updated : Nov 8, 2020, 3:13 PM IST

ABOUT THE AUTHOR

...view details