భారతదేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ శుభాకాంక్షలు తెలిపారు. సత్యం, అహింస మార్గాన్ని అనుసరించి, గాంధీ మార్గదర్శనంలో భారతదేశం స్వాతంత్ర్యం సాధించిందని గుర్తు చేశారు. వైవిధ్యంతో కూడిన రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు ప్రజలకోసం పాటుపడగలవనే సందేశాన్ని ప్రపంచానికి అందించాలని పిలుపునిచ్చారు. ప్రజల అభిప్రాయాలను గౌరవించే సంస్థాగత నిబద్ధత.. ఇరుదేశాల బంధాన్ని బలోపేతం చేసిందని అన్నారు.
గత ఏడాది కాలంగా ఇరుదేశాలు కొత్త మార్గాల్లో తమ భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకున్నాయని బైడెన్ పేర్కొన్నారు. కరోనాపై పోరాటం సహా, క్వాడ్ కూటమి ద్వారా టీకాల తయారీకి కసరత్తులు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. భారత్-అమెరికా మధ్య భాగస్వామ్యానికి ఇదివరకెన్నడూ లేనంత ప్రాధాన్యం సంతరించుకుందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు భారత స్వాతంత్ర్య దినోత్సవ సందేశంలో పేర్కొన్నారు.
"సత్యం, అహింస అనే మహాత్మా గాంధీ సందేశాన్ని పాటిస్తూ.. సుదీర్ఘ స్వాతంత్ర్య కాంక్షను భారత్ 1947 ఆగస్టు 15న నెరవేర్చుకుంది. ప్రజాస్వామ్యం ద్వారా ప్రజల అభిప్రాయాలను గౌరవించాలనే సంస్థాగత నిబద్ధతను గౌరవించడం.. ప్రపంచానికి ప్రేరణ కలిగిస్తోంది. ఇరుదేశాల మధ్య ప్రత్యేక బంధం ఏర్పడేందుకు ఇదే కారణం. దశాబ్దాలుగా ఇరుదేశ ప్రజలు, 40 లక్షలకు పైగా భారతీయ అమెరికన్ల మధ్య భాగస్వామ్యం బలోపేతమైంది. అనేక సవాళ్లు, అవకాశాలు ఎదురుచూస్తున్న ప్రస్తుత సమయంలో ఇరుదేశాల మధ్య భాగస్వామ్యానికి ఎన్నడూ లేనంత ప్రాధాన్యం ఏర్పడింది. రెండు అతిపెద్ద, వైవిధ్యమైన ప్రజాస్వామ్యాలు.. ప్రజల కోసం అనుక్షణం పాటుపడతాయనే సందేశాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలి. అదే విధంగా, మన ఇరుదేశాల మధ్య స్నేహభావం మరింత పెంపొందాలి. భారత్, అమెరికాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు."