Jeffrey Epstein Trafficking: గొలుసుకట్టు పథకాన్ని పోలినట్లు సెక్స్ కుంభకోణానికి పాల్పడ్డాడో అమెరికన్ ఫైనాన్షియర్.. అమెరికాలోని విలాసవంతమైన జీవితాల వెనుక చీకటి కోణాన్ని ఆ కుంభకోణం బయటపెట్టింది. ఆ సంపన్న ఫైనాన్షియర్ తన పరపతి పెంచుకోవడం కోసం ఏళ్ల తరబడి టీనేజ్ అమ్మాయిలను ఎరగా వేశాడు. ఆయన సన్నిహితుల జాబితాలో ఇద్దరు అమెరికా మాజీ అధ్యక్షులు.. బ్రిటన్ రాణి సుపుత్రుడు.. వ్యాపారవేత్తలు.. రాజకీయ నాయకులు ఉన్నారు. చివరికి బండారం బయటపడి ఊచలు లెక్కపెట్టాడు. కానీ, హఠాత్తుగా జైల్లోనే అనుమానాస్పదంగా మరణించాడు..! ఆ దుర్మార్గుడి పేరు జెఫ్రీ ఎపిస్టన్..! ఈ పాపాల్లో సహకరించిన అతడి స్నేహితురాలిపై తాజాగా నేర నిరూపణ జరగడంతో ఈ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఆమె పేరు గిలిన్ మాక్స్‌వెల్..!
ఎవరీ జెఫ్రీ ఎపిస్టన్..?
ఎపిస్టన్ న్యూయార్క్ నగరంలో పుట్టాడు. ఓ విశ్వవిద్యాలయంలో భౌతిక శాస్త్రం, గణితం చదివాడు. కానీ, డిగ్రీ మాత్రం పూర్తి చేయలేదు. 1970ల్లో ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా చేరాడు. అక్కడి విద్యార్థుల్లో ఒకరి తండ్రి ఎపిస్టన్‌ను చూసి ప్రభావితమై.. వాల్‌స్ట్రీట్‌లోని తన భాగస్వామి అయిన ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్‌కు పరిచయం చేశాడు. ఆ తర్వాత నాలుగేళ్లకే ఎపిస్టన్ అండ్ కో అనే అసెట్‌మేనేజ్‌మెంట్ సంస్థను సొంతగా ప్రారంభించారు. ఆ సంస్థ వేగంగానే విజయం సాధించింది. బిలియన్ డాలర్ల సంపద కంటే తక్కువ ఉన్నవారి కోసం ఎపిస్టన్ పనిచేయడు. హఠాత్తుగా వచ్చిపడిన సంపదతో ఎపిస్టిన్ ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌లో రాజభవనాన్ని తలపించే ఇంటిని కొనుగోలు చేశాడు. న్యూమెక్సికోలో స్థలాలు కొన్నాడు. అప్పట్లోనే న్యూయార్క్‌లో అతిపెద్ద ప్రైవేట్ హోమ్‌ను సొంతం చేసుకొన్నాడు. ఇక్కడ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, కళాకారులకు పార్టీలు ఇచ్చేవాడు. ఎపిస్టన్ మిత్రుల్లో క్లింటన్, ట్రంప్, కెనడీ కుటుంబీకులు, మీడియా దిగ్గజం మద్రోక్, మిషెల్ బ్లూమ్‌బెర్గ్, రిచర్డ్ బ్రాన్సన్, మైకెల్ జాక్సన్, బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయర్, ఇజ్రాయెల్ మాజీ ప్రధాని ఎహుద్ బరాక్, సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ వంటి వారు ఉన్నారు.
జెఫ్రీతో అంటకాగిన బిల్‌క్లింటన్, ట్రంప్..!
ఎపిస్టన్‌కు ఓ ప్రైవేటు బోయింగ్ 747 విమానం ఉంది. దానిలో హైప్రొఫైల్ మిత్రులతో కలిసి విదేశాలకు వెళ్లేవాడు. ఈ విమానాన్ని వర్జిన్ ద్వీపాల్లో స్థానికులు 'లోలితా ఎక్స్‌ప్రెస్'గా పిలిచేవారు. తరచూ దీనిలో యువతులు, బాలికలు అనుమానాస్పదంగా కనిపిస్తుండటంతో ఈ పేరు పెట్టారు.
జెఫ్రీ మీడియాకు దూరంగా ప్రైవేటు జీవితం గడిపేందుకు ఇష్టపడుతుంటాడు. 2002 సెప్టెంబర్‌లో అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, నటులు కెవిన్ స్పాసీ, క్రిస్ టక్కర్‌తో కలిసి ఎపిస్టన్ ప్రైవేటు జెట్‌లో ఆఫ్రికా ఖండంలో పర్యటించేందుకు వెళ్లారు. ఈ ఘటన మీడియాను ఆకర్షించింది. ఎవరీ ఎపిస్టన్ అని తెలియజేస్తూ 'న్యూయార్క్' మ్యాగజైన్ 'నిగూఢమైన కుబేరుడు: జెఫ్ ఎపిస్టన్' అనే కథనం రాసింది. ఈ కథనం కోసం అప్పట్లో ప్రముఖ వ్యాపారిగా పేరున్న డొనాల్డ్ ట్రంప్ (14ఏళ్ల తర్వాత అమెరికా అధ్యక్షుడు అయ్యారు) అభిప్రాయం కూడా తీసుకొంది. 'నాకు 15 ఏళ్ల నుంచి ఎపిస్టన్ తెలుసు. అద్భుతమైన వ్యక్తి. అతడు కూడా నాలానే అందమైన యువతులు, బాలికలను ఇష్టపడతాడు' అంటూ వ్యాఖ్యానించారు. ఈ కథనం వెలువడిన తర్వాత 2003లో 'న్యూయార్క్' పత్రికను కొనేసేందుకు జెఫ్రీ విఫల యత్నం చేశాడు. ఆ తర్వాత నుంచి జెఫ్రీ తరచూ వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు.
కొంతకాలానికి ఎపిస్టన్, ట్రంప్ మధ్య ఆర్థిక విషయాల్లో వివాదాలు జరిగినట్లు ప్రచారం జరిగింది. మరోవైపు బిల్‌క్లింటన్.. ఎపిస్టన్‌తో కలిసి 27సార్లు వివిధ పర్యటనలకు వెళ్లినట్లు ఫ్లైట్ రికార్డులు 2016లో బయటపడ్డాయి. మాజీ మిస్ స్విడన్ ఎవా అండర్సన్, గిలిన్ మాక్స్‌వెల్‌లతో ఎపిస్టిన్ డేటింగ్ చేశాడు. కానీ, జీవితంలో ఎవరినీ పెళ్లిచేసుకోలేదు.