అమెరికా పర్యటనలో ఉన్న విదేశాంగ మంత్రి జైశంకర్.. గురువారం ఆ దేశ జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ) జేక్ సులివాన్తో సమావేశమయ్యారు. ఇండో పసిఫిక్, అఫ్గానిస్థాన్ అంశంపై వారిద్దరూ విస్తృతంగా చర్చలు జరిపారు.
"అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సులివాన్ను కలిసినందుకు సంతోషంగా ఉంది. ఇండోపసిఫిక్ సహా అఫ్గానిస్థాన్ అంశాలపై విస్తృతంగా చర్చలు జరిపాం. కరోనాపై పోరులో అమెరికా సంఘీభావానికి ప్రశంసలు తెలిపాం. భారత్-అమెరికా వ్యాక్సిన్ భాగస్వామ్యం పెద్ద మార్పును తీసుకువస్తుంది."
-జైశంకర్, విదేశాంగ మంత్రి
అమెరికాకు భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధుతో కలిసి జైశంకర్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. జై శంకర్ తన ఐదు రోజుల పర్యటనలో భాగంగా.. అమెరికా వాణిజ్య రాయబారి క్యాథరిన్ థాయ్తోనూ సమావేశమయ్యారు. వ్యాక్సిన్లను సేకరించడానికి మేథో సంపత్తి హక్కులను రద్దు చేయాలన్న భారత ప్రతిపాదనకు సంబంధించిన అంశాలపై వారు చర్చలు జరిపారు.