'కరోనాకు వ్యాక్సిన్ అవసరం లేదు.. నేను టీకా తీసుకోను.. అది నా హక్కు' అంటూ గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సొనారో ఇప్పుడు స్వయంగా టీకా కోసం ఎదురుచూస్తున్నారు. వ్యాక్సిన్లను వీలైనంత త్వరగా పంపించాలంటూ భారత ప్రధాని నరేంద్రమోదీకి ఆయన లేఖ రాశారు. ఈ మేరకు ఆయన కార్యాలయం వెల్లడించింది.
'మా దేశంలో ఇమ్యూనైజేషన్ ప్రొగ్రామ్‌ను అత్యవసరంగా అమలు చేయాల్సిన అత్యవసరం ఉంది. అందువల్ల భారత్‌లోని ఆస్ట్రాజెనెకా(కొవిషీల్డ్) నుంచి ఆర్డర్ చేసుకున్న 2 మిలియన్ల డోసులను వీలైంతన త్వరగా పంపించగలరు' అని బొల్సొనారో ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రపంచంలో కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉన్న దేశాల్లో బ్రెజిల్ మూడో స్థానంలో ఉండగా.. మరణాల్లో రెండో స్థానంలో ఉండటం గమనార్హం. ఇప్పటి వరకు ఆ దేశంలో 2లక్షల మందికి పైగా కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.
దీంతో దేశంలో వెంటనే టీకా పంపిణీ కార్యక్రమం చేపట్టాలని అధ్యక్షుడు బొల్సొనారోపై ఒత్తిడి నానాటికీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే బ్రెజిల్‌కు చెందిన కొన్ని ప్రైవేటు సంస్థలు భారత్‌లోని ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా టీకా కోసం ఒప్పందం కుదుర్చుకున్నాయి. టీకా డోసుల కోసం ముందస్తు ఆర్డర్లు కూడా చేసుకున్నాయి. అటు చైనాలో తయారైన టీకాల కోసం బ్రెజిల్ ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా.. బ్రెజిల్‌లో కరోనా తీవ్రత పెరగడానికి అధ్యక్షుడు బొల్సొనారో ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమనే విమర్శలు ఎక్కువయ్యాయి. దేశంలో కరోనా తీవ్ర రూపం దాల్చినా బొల్సొనారో మాత్రం మొదట్నుంచీ వైరస్‌ను తక్కువచేసి చూశారు. స్వయంగా కరోనా బారిన పడినా కూడా.. కనీస నిబంధన అయిన మాస్క్ కూడా ధరించలేదు. అంతేగాక, తన దేశ ప్రజలకు టీకా అవసరం లేదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే గత కొంతకాలంగా ఆయనపై విమర్శలు పెరగడంతో దిగిరాక తప్పలేదు.
ఇదీ చూడండి: 'అమెరికా చరిత్రలోనే ట్రంప్ అసమర్థ అధ్యక్షుడు'