ట్రంప్ మద్దతుదారులు సృష్టించిన అలజడికి అమెరికాలోని క్యాపిటల్ భవనం అల్లకల్లోలంగా మారింది. ఈ ఘటనతో ప్రపంచ దేశాల ముందు అగ్రరాజ్య ఖ్యాతి పడిపోయినట్లయింది. అయితే.. ఇది ముగింపు కాదని అమెరికా కీర్తి పతనానికి, నైతిక విలువలు కోల్పోయిందనడానికి ఆరంభమని ప్రముఖ పాత్రికేయుడు ఆదిత్యా సిన్హా పేర్కొన్నారు. ఈ ఘటన తర్వాత అమెరికా రాజకీయాలు ఎలాంటి మలుపు తిరుగనున్నాయనే అంశంపై 'ఈటీవీ భారత్' చెన్నై బ్యూరో ప్రతినిధి ఎంసీ రాజన్‌తో ఆయన మాట్లాడారు.
'క్యాపిటల్' దాడి తర్వాతి అమెరికా రాజకీయాల్లో వచ్చే మార్పు.. నేడో రేపో తెలిసేది కాదని ఆదిత్యా సిన్హా అన్నారు. రాబోయే రోజుల్లో ఇది స్పష్టంగా కనిపిస్తుందని చెప్పారు. 1945లో ఇంగ్లాండ్ ఎలాంటి పరిస్థితుల్లో ఉందో.. ప్రస్తుతం అమెరికా కూడా అలాంటి స్థితిలోని ఉందని ఆయన పేర్కొన్నారు. రానున్న రోజుల్లో అగ్రరాజ్యంలో విద్వేష, జాత్యహంకార పోకడలు కరుడుగట్టుకు పోతాయని ఆయన అభిప్రాయపడ్డారు. శ్వేతజాతీయుల్లో చాలా మంది అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు మద్దతు తెలపడం ఇందుకు సాక్ష్యమని వివరించారు.